Sunday, April 28, 2024

ఈశాన్యంలో కాషాయం.. మోడీ అభివృద్ధికి నిదర్శనం.. ఎంపీ జీవీఎల్ నరసింహారావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ :ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్‌తో పాటు మేఘాలయలో కాషాయం రెండోసారి రెపరెపలాడిందని, ఇది అక్కడ జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. త్రిపురలో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన మెజారిటీని బీజేపీ సొంతంగా సాధించిందని, నాగాలాండ్‌లో మిత్రపక్షం నేషనల్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)తో కలిసి భారీ మెజారిటీ సాధించిందని తెలిపారు. మేఘాలయలో మిత్రపక్షంతో కలిసి పోటీ చేయనప్పటికీ, రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయని వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ విస్తరిస్తుందని చాలామంది కలలో కూడా ఊహించలేదని, కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాటలతో సరిపెట్టకుండా అభివృద్ధిని చేతల్లో చూపారని, అందుకే ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరగని అభివృద్ధి గత కొన్నేళ్లలో చేసి చూపించారని, అన్ని రాష్ట్రాలకు రోడ్డు, రైలు, విమానయాన సదుపాయాలు కల్పించి మిగతా రాష్ట్రాలతో అన్ని రకాలుగా అనుసంధానం చేశారని చెప్పారు. అలాగే అద్భుతమైన సహజసిద్ద ప్రకృతి సౌందర్యానికి నిలయమైన ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక రంగాన్ని సైతం పరుగులు పెట్టిస్తున్నారని, గతంలో ఎన్నడూ లేనంత పర్యాటకుల తాకిడిని ఈశాన్య రాష్ట్రాలు చూస్తున్నాయని, తద్వారా అక్కడి స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయని అన్నారు.

జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు బీజేపీ, దాని మిత్రపక్షాలను ఆదరించారని జీవీఎల్ నరసింహారావు సూత్రీకరించారు. త్రిపురలో ఈసారి కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీచేసినా సరే బీజేపీ కూటమిని ఎదుర్కోలేకపోయాయని చెప్పారు. భారత్ జోడో పేరుతో రాహుల్ గాంధీ యాత్ర చేపట్టిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లోనే ఆ పార్టీ పరిస్థితి ఇలా ఉందని అన్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో సీట్ల సంఖ్య తగ్గినప్పటికీ, ఈసారి గుజరాత్ తరహాలో భారీ ఆధిక్యతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ప్రజలు శాంతిభద్రతలు, అభివృద్ధి కోరుకుంటారని, అవి అందించే ప్రభుత్వానికి, పార్టీకి ఆదరణ ఎప్పటికీ ఉంటుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement