Friday, May 3, 2024

కాంగ్రెస్ శ్రేణులు ఆమరణ దీక్ష.. భగ్నం చేసిన పోలీసులు

మంచిర్యాల టౌన్ (ప్రభన్యూస్) : గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా కడెం ప్రాజెక్ట్ ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గత మూడు రోజులుగా దండేపల్లి మండల కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా గురువారం దీక్షను పోలీసులు భగ్నం చేసి దీక్ష చేస్తున్న వారిని వైద్య చికిత్సల నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ-ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆసుపత్రి వద్దకు చేరుకొని ఐబి ప్రాంతంలో ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంభిస్తున్న చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతుందని, రైతులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని ప్రచారం చేస్తుందే తప్ప రైతులకు చేసింది శూన్యమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అసమర్థ పాలన వల్ల నియోజకవర్గంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, సాగునీరు అందక పంటలు సరిగ్గా పండక ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మానసికంగా ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా పోరాటాలు చేస్తుంటే పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు సాగునీరు అందేంత వరకు తమ పోరాటాన్ని ఆపబోమని, అక్రమ అరెస్టులకు భయపడేది లేదని ఆమె అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement