Wednesday, May 8, 2024

సుప్రీంలో పిటిషన్ దాఖలు చేస్తాం.. జేఏసీ చైర్మన్ జీవీఆర్ శాస్త్రి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాజధానుల వివాదం కేసుపై విచారణ రాజ్యాంగ ధర్మాసనం చేపట్టాలని అమరావతి జేఏసీ కోరింది. ఈ మేరకు వారం రోజుల్లో సుప్రీంకోర్టులో తాము స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తామని జేఏసీ చైర్మన్ జీవీఆర్ శాస్త్రి తెలిపారు. గురువారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, ఐదుగురు లేదా ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం రాజధాని కేసుపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కేఎం జోసెఫ్ ఈ కేసు రాజ్యాంగపరమైన అంశాలతో ముడిపడి ఉందన్నారని శాస్త్రి గుర్తుచేశారు. రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు ఉన్నపుడు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు.

రాజధాని విషయంలో నిర్ణయాధికారం ఎవరికి ఉందన్నదే ఇక్కడ మౌలికంగా తలెత్తిన ప్రశ్న అని, కేంద్రం ఇచ్చిన అఫిడవిట్, పార్లమెంట్ లో ఇచ్చిన సమాధానాలను బట్టి చూస్తే రాజ్యాంగ ధర్మాసనం అవసరమని స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చోవాలన్నది ఆయన ఇష్టారీతిన నిర్ణయించుకోలేరని, విభజన చట్టాన్ని చేసిన పార్లమెంటును రాష్ట్రం ప్రశ్నించలేదని అన్నారు. అమరావతి రైతులు చాలా నష్టపోయారని, వారికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే రాజధానిని విశాఖకు తరలించే హక్కు ప్రభుత్వానికి లేదని శాస్త్రి వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement