Sunday, May 5, 2024

అహ్మదాబాద్​ సీరియల్​ బాంబ్​ బ్లాస్ట్ కేసు​.. 49 మంది దోషులుగా తీర్పు, రేపు శిక్ష ఖరారు

2008లో అహ్మదాబాద్ జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్​ ప్రత్యేక కోర్టు ఇవ్వాల తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 49మందిని దోషులుగా నిర్ధారించింది స్పెషల్​ కోర్టు. అంతేకాకుండా మరో 28 మందిని నిర్దోషులుగా ప్రకటించింది ధర్మాసనం. 2008, జూలై 26న 19 బాంబులు అహ్మదాబాద్​ సిటీని అల్లకల్లోలం చేశాయి. ఈ బాంబు పేలుళ్లలో 56మంది ప్రాణాలు కోల్పోయారు. 200మందికి పైగా గాయపడ్డారు. కాగా, రేపు (బుధవారం) దోషులకు శిక్ష ప్రకటించనుంది స్పెషల్​ కోర్టు.

13 ఏళ్ల నాటి ఈ కేసులో 2002, సెప్టెంబరు నాటికి విచారణ ముగిసింది. ఈ కేసు తీర్పును ప్రకటించడానికి ఈ నెల ప్రారంభంలో రెండుసార్లు నోటిఫై చేసినప్పటికీ అది వాయిదా పడుతూ వస్తోంది. సీరియల్​ బాంబ్​ బ్లాస్ట్​ కేసులో మొత్తం 77 మందిపై విచారణ జరిగింది. ఇందులో 12 మందిని సాక్ష్యాధారాలు లేని కారణంగా వదిలేశారు. మరో 16 మందిని అనుమానితులుగా పేర్కొంటూ నిర్దోషులుగా విడుదల చేశారు. నిషేధిత స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమీ)కి చెందిన తీవ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌తో సంబంధం ఉన్న వ్యక్తులే ఈ పేలుళ్లకు పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు.

అహ్మదాబాద్ సీరియల్ బ్లాస్ట్ కేసు ఏమిటి?

అది 2008, జూలై 26వ తేదీ.. 70 నిమిషాల వ్యవధిలో అహ్మదాబాద్ సిటీ మొత్తం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. నిమిషాల వ్యవధిలోనే 21సార్లు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 56 మంది మృతి చెందారు. దాదాపు 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 2002లో గుజరాత్‌లో జరిగిన గోద్రా అల్లర్లకు ప్రతీకారంగా ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు ఈ పేలుళ్లకు ప్లాన్ చేసి, బాంబు బ్లాస్ట్​ చేశారని ఆరోపణలొచ్చాయి. బాంబు పేలుళ్లకు సంబంధించి అహ్మదాబాద్‌లో 20 కేసులు నమోదయ్యాయి. అహ్మదాబాద్‌లో ఉగ్రదాడి జరిగిన రెండు రోజుల తర్వాత నగరంలోని పలు ప్రాంతాల నుంచి బాంబులు స్వాధీనం చేసుకోవడంతో సూరత్‌లో మరో 15 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి ప్రత్యేక న్యాయమూర్తిగా ఏఆర్ పటేల్  ఉన్నారు. ప్రాసిక్యూషన్​లో భాగంగా  1,100 మందికి పైగా సాక్షులను విచారించారు.

నిందితుల్లో నలుగురిని అప్రూవర్లుగా మారారు. ఆ తరువాత తాము ఒత్తిడితోనే అలా చేశామని, న్యాయ పోరాటం చేశారు. నిందితుల్లో మరొకరు అప్రూవర్‌గా మారడానికి ముందుకురావడంతో కోర్టు అంగీకరించింది. ప్రత్యేక న్యాయస్థానం తొలుత సబర్మతి సెంట్రల్ జైలులో ఈ కేసును విచారించింది. అయితే.. చాలా మట్టుకు ప్రాసిక్యూషన్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగింది. పలు వివాదాలు, అడ్డంకుల మధ్య విచారణ జరిగింది. ఈ కేసులో 24మంది నిందితులు జైలు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడం హైలైట్​గా చెప్పుకోవచ్చు. జైలులోని ఛోటా చక్కర్ ప్రాంతం నుంచి తవ్విన 213 అడుగుల సొరంగాన్ని జైలు అధికారులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement