Tuesday, May 7, 2024

ఆక‌ర్ష‌.. ఆక‌ర్ష‌: తెలంగాణకు రానున్న యోగీ ఆదిత్య నాథ్.. వ‌చ్చే నెల‌లో అమిత్ షా టూర్

ప్రభ న్యూస్​, సంగారెడ్డి ప్రతినిధి​: తెలంగాణ‌పై బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. దీనిలో భాగంగా ఈ నెలాఖ‌రులో ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌, ఆ పార్టీ చీఫ్‌ జేపీ న‌డ్డా రానున్న‌ట్టు స‌మాచారం. అయితే తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తే ద‌క్షిణ భార‌త దేశంలో మ‌రింత బ‌లోపేతం కావచ్చొని జాతీయ‌ నాయ‌క‌త్వం ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నెల చివ‌రి వారంలో గాని, ఏప్రిల్ మొద‌టి వారంలో కానీ జ‌న‌గామ‌లో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలంటున్నాయి.

కాగా, ఏప్రిల్ 14న తెలంగాణకు అమిత్ షా కూడా రానున్న‌ట్టు స‌మాచారం. పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి స‌జ‌య్ చేపట్టనున్న ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభ కార్య‌క్ర‌మానికి షా హాజ‌రు కానున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ బ‌లోపేతం చేయ‌డంలో భాగంగా రెండురోజుల పాటు తెలంగాణ‌లోనే అమిత్ షా మ‌ఖాం వేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ సంద‌ర్భంగా బూత్ లెవ‌ల్ కార్య‌క‌ర్త‌ల‌తో షా భేటీ కానున్నారు. అమిత్ షా రానున్న నేప‌థ్యంలో పార్టీలో పెద్ద ఎత్తున చేరిక‌ల‌కు బీజేపీ నేత‌లు ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఇప్ప‌టికే త‌మ‌తో చాలామంది ముఖ్య నేత‌లు ట‌చ్‌లో ఉన్నార‌ని ఆ పార్టీ లీడ‌ర్లు చెబుతున్నారు.

రాష్ట్ర నాయ‌క‌త్వానికి సంభందం లేకుండా నియోజ‌క వ‌ర్గాల్లో ప్ర‌త్యేక టీంలు కూడా ప‌ర్య‌టిస్తున్నాయి. నియోజ‌క వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితుల‌పై ఆరాతీస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు అవ‌కాశాల‌పై జాతీయ నాయ‌క‌త్వానికి సెంట్ర‌ల్ టీం నివేదిక స‌మ‌ర్పించ‌డ‌మే దీనికి కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రికి ప‌ట్టుంది అనే అంశంపై పూర్తిస్థాయిలో నివేద‌క రూపొందిస్తున్న‌ట్టు స‌మాచారం. అదేవిధంగా గెలుపు గుర్ర‌లకే టికెట్ ఇవ్వాల‌ని జాతీయ నాయ‌క‌త్వం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement