Monday, May 13, 2024

100ఫుడ్‌ ప్లాజాల ఏర్పాటు: రైల్వే..

దేశవ్యాప్తంగా వివిధ రైల్వేస్టేషన్లలో ఫుడ్‌ ప్లాజాలు, ఫాస్ట్‌ ఫుడ్‌ యూనిట్లు, రెస్టారెంట్లు ఏర్పాటుకు రైల్వేశాఖ నిర్ణయించింది. ఐఆర్‌సీటీసీకి కేటాయించిన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఆయా చోట్ల వీటిని నెలకొల్పాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఆయా జోనల్‌ కార్యాలయలకు ఇటీవల రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. టికటేతర ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. రైళ్లలో ఆహారం అందించే ఉద్దేశంతో ఐఆర్‌సీటీసీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గతంలో ఫుడ్‌ ప్లాజాలను నెలకొల్పేందుకు రైల్వే శాఖ స్థలం కేటాయించింది. అయితే, వీటి ఏర్పాటులో ఐఆర్‌సీటీసీ విఫలమైంది. దీనివల్ల ఆదాయానికి గండిపడుతోందని భావించిన రైల్వే శాఖ వాటి ఏర్పాటు బాధ్యతను తాజాగా రైల్వే జోన్లకు అప్పగించింది.

ఆయా ఖాళీ స్థలాలను వినియోగించుకునేందుకు 17 రైల్వే జోన్లకు రైల్వే బోర్డు అనుమతి ఇచ్చింది. నిరుపయోగంగా ఉన్న ఆయా స్థలాల్లో ఫుడ్‌ ప్లాజాలు, ఫాస్ట్‌ఫుడ్‌ కేందద్రాలు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు తన ఉత్తర్వుల్లో రైల్వే జోన్లకు సూచించింది. దేశవ్యాప్తంగా ఆయా జోన్ల పరిధిలో సుమారు 100 నుంచి 150 వరకు ఈ తరహా యూనిట్లు నెలకొల్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న కాంట్రాక్టులను సమీక్షించిన అనంతరం 9 ఏళ్ల కాలానికి వీటి కోసం బహిరంగ టెండర్లు ఆహ్వానించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement