Sunday, May 5, 2024

ఐదేళ్లలో 80 నవోదయ స్కూళ్లు, తెలంగాణకు మాత్రం జీరో.. మాపై ఎందుకింత కక్ష: టీఆర్ఎ​స్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రతి విషయంలో వన్ నేషన్, వన్ పాలసీ అని చెప్పే కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రాలను ఒకేలా ఎందుకు చూడడంలేదని టీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు మండిపడ్డారు. ఉభయసభల నుంచి వాకౌట్ చేసిన అనంతర టీఆర్ఎస్ రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు సురేష్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, నామా నాగేశ్వరరావు, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాసరెడ్డి, బీబీ పాటిల్ తదితరులు తెలంగాణా భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ… రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని పలుమార్లు పార్లమెంట్ సమావేశాల్లో చెప్పామని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు, ఎస్టీ రిజర్వేషన్లు, నిరుద్యోగం, నవోదయ విద్యాలయాల అంశాలను లేవనెత్తామని అన్నారు. రాష్ట్ర సమస్యలపై చర్చించే అవకాశం ఇవ్వడం లేదని వాకౌట్ చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నా కేంద్రం ఏమీ చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాకో నవోదయ విద్యాలయం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.

ప్రస్తుతం 9 నవోదయ విద్యాలయాలు మాత్రమే మంజూరు చేశారని… ఇంకా 23 ఇవ్వాల్సి ఉందని తెలిపారు. పార్లమెంట్‌లో నవోదయల అంశాన్ని లేవనెత్తినా,, ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖలు రాసినా ఫలితం లేదన్నారు. 33 జిల్లాలకు 33 నవోదయ విద్యాలయాలు ఇవ్వాల్సిందేనని ఎంపీ తేల్చి చెప్పారు. అస్సాంకు 27, గుజరాత్‌లో 31, హర్యానాకు 21, హిమాచల్ ప్రదేశ్‌కు 17, మణిపూర్‌లో 11, త్రిపురలో 7 నవోదయ విద్యాలయాలు ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఐదేళ్లలో 80 నవోదయ విద్యాలయాలు ఇచ్చిన కేంద్రప్రభుత్వం తెలంగాణకు మాత్రం ఒక్క విద్యాలయం కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. తెలంగాణాపై ఎందుకింత కక్ష? ఎందుకిలా విషం కక్కుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణా భారతదేశంలో లేదా? తెలంగాణ బిడ్డలు భరతమాత బిడ్డలు కారా అని నిలదీశారు. కేరళ తర్వాత బాగా చదువుకున్న విద్యార్థుల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని వివరించారు. ఎందుకు రాష్ట్ర ప్రజల సమస్యలపై కేంద్రాన్ని నిలదీయట్లేదని బీజేపీ ఎంపీలను నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. చేతనైతే పెండింగ్‌లో ఉన్న నవోదయ విద్యాలయాలను ఒక్క నెలలో తీసుకురమ్మంటూ సవాల్ విసిరారు. అన్ని అంశాలపై తెలంగాణకు న్యాయం జరిగే వరకు అన్ని పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. సమాజంలో అసమానతలు తొలగించాలంటే విద్య అతి ముఖ్యమైన అంశమని కేటీఆర్ బాగా నమ్ముతారని ఎంపీ సురేష్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను వరంగల్‌కు తీసుకెళ్లడంలో విజయం సాధించారని హర్షం వ్యక్తం చేశారు. ఒక జిల్లాలో నవోదయ ఏర్పాటైతే పరిసర ప్రాంతాల్లోని విద్యాలయాల్లో కూడా చదువు నాణ్యత పెరుగుతుందన్నారు. తెలంగాణ అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉంటామని, ఈ మొండి ప్రభుత్వంపై తమ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని సురేష్ రెడ్డి స్పష్టం చేశారు.

రాష్ట్ర విభజన నుంచి ఇచ్చిన హామీలకు కేంద్రం తూట్లు పొడుస్తోందని ఎంపీ బడుగుల లింగయ్య ధ్వజమెత్తారు. కృష్ణా ట్రిబ్యునల్, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఇలా ఏ హామీనీ నెరవేర్చలేదని గుర్తు చేశారు. కాళేశ్వరం, రైతు బంధు, కళ్యాణలక్ష్మి ఇలా అనేక పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణ సమస్యలపై టీఆర్ఎస్ ఎంపీలు పోరాడుతుంటే అవహేళన చేస్తున్నందుకు బీజేపీ ఎంపీలు సిగ్గుపడాలని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమికొట్టే రోజులు రానున్నాయని హెచ్చరించారు. పంజాబ్‌లో ఎలా ధాన్యం సేకరిస్తున్నారో తెలంగాణలోనూ అలాగే చేయాలని లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement