Tuesday, May 7, 2024

హత్య కేసులో రెజ్లర్ సుశీల్ కుమార్ కు లుకవుట్ నోటీసులు

రెజ్లర్ సుశీల్ కుమార్ పై  ఢిల్లీ పోలీసులు లుకవుట్ నోటీసులు జారీ చేశారు. ఓ జాతీయ స్థాయి యువ రెజ్లర్ సాగర్ ధన్కడ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ కుమార్ పరారీలో ఉన్నాడు. కొద్ది రోజులుగా అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆదివారం పలువురు మరో ఇద్దరు బాధితుల స్టేట్ మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు. సుశీల్ కుమారే సాగర్ ను హత్య చేశాడని బాధితులు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో అతడిని పట్టుకునేందుకు లుకవుట్ నోటీసులు జారీ చేసినట్టు అదనపు డీసీపీ డాక్టర్ గురిక్బాల్ సింగ్ సిద్ధూ చెప్పారు. గత మంగళవారం ఛత్రసాల్ స్టేడియంలోని పార్కింగ్ ప్రదేశంలో సుశీల్, అజయ్, ప్రిన్స్, సోనూ, సాగర్, అమిత్ తదితరుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో తీవ్రంగా గాయపడిన సాగర్ మరణించాడు. ఆ తర్వాతి రోజు నుంచే సుశీల్ పరారీలో ఉన్నాడు.

ఢిల్లీ నుంచి హరిద్వార్ లోని ఓ ఆశ్రమంలో ఉన్నాడని, అక్కడి నుంచి రుషికేశ్ కు వెళ్లి తిరిగి ఢిల్లీ వచ్చాడని తెలుస్తోంది. ఆ తర్వాత హర్యానాలో మాటిమాటికీ ప్రాంతాలను మారుస్తున్నట్టు సమాచారం. సుశీల్ ను పట్టుకునేందుకు అతడి బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించామని, ఐదు కార్లలో తనిఖీ చేసి ఒక డబుల్ బ్యారెల్ లోడెడ్ తుపాకీ, ఐదు బుల్లెట్ కార్ట్రిడ్జ్ లను స్వాధీనం చేసుకున్నామన్నామని పోలీసులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement