Tuesday, May 14, 2024

ఈ రోదన‌లు ఇంకా ఎన్నాళ్లు….

ఆంధ్రప్ర‌భ దినప‌త్రిక ప్ర‌త్యేక క‌థ‌నం

గతేడాది కరోనా ఈ దేశాన్ని తీవ్రంగా పట్టిపీడించింది. అయితే తక్కువ సమయంలోనే అది దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దీంతో కరోనాపై భారత్‌ విజయం సాధించిందంటూ అంతర్జాతీయంగా ప్రచారం చేసుకున్నాం. కరోనాను తన్ని తరిమేశామంటూ గంటాబజాయించాం. కానీ తొలి తరంగ సమయంలోనే కొన్ని వాస్తవాలు వెలుగుచూశాయి. ఇలాంటి మహమ్మారిలను ఎదుర్కొనే వైద్య పరిజ్ఞానం, సదుపాయాలు, పరికరాలు అందుబాటులో లేవని భారత్‌కు తెలిసొచ్చింది. ఇలాంటి మహమ్మారి మరోసారి విరుచుకుపడుతుందన్న ఆలోచన చేయడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. మరోసారి ఇలాంటి ఉపద్రవం ముంచుకొస్తే ఎలా ఎదుర్కొంటామన్న ఆలోచన కొరవడింది. కనీసం కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాతైనా దేశంలో వైద్య సదుపాయాల మెరుగుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కొత్తగా ఆసుపత్రుల నిర్మాణానికి, ఉన్న ఆసుపత్రుల్లో పడకల పెంపునకు, మందులు, వ్యాక్సిన్‌ల తయారీకి, ఆక్సిజన్‌ ఉత్పత్తికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తొలిదశలో లక్షలాదిమంది బలయ్యారు. అయినప్పటికీ వేగంగానే భారత్‌లో కోవిడ్‌ తొలిదశ ముగిసిపోయింది.
నిస్సహాయ మరణాల్తో భారత్‌ రోధిస్తోంది. ఈ దేశానికి మరణం కొత్తకాదు. రోజువారి లక్షలాదిమంది చనిపోతుంటారు. కానీ కరోనా మరణాలు ఇందుకు భిన్నం. సాధారణ మరణాల్లో భౌతికకాయాన్ని గౌరవిస్తారు. దండలేసి నివాళులర్పిస్తారు. ఊరేగింపుగా మోసుకెళ్తారు. మత సంప్రదాయాలకను గుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ ఇప్పుడు రోజూ కోవిడ్‌తో చనిపోతున్న వేలాదిమందిని ప్లాస్టిక్‌ సంచుల్లో మూటలు కట్టేస్తున్నారు. ముక్కు, మొహం కూడా కనబడకుండా తాళ్ళతో బిగిస్తున్నారు. ఒకే వాహనంలో పదేసి మందిని స్మశానవాటికకు తరలిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా అక్కడకక్కడా కొన్ని పదుల మీటర్ల దూరంలో నిలబడి నిశ్శబ్దంగా మృతుల్ని తలచుకోవడానికే పరిమితమౌతున్నారు. ఎలాంటి సంప్రదాయ శ్రాద్దకర్మలు స్మశానవాటికలో నిర్వహించడంలేదు. ఎంత త్వరగా భౌతిక కాయానికి అంత్యక్రియలు పూర్తవుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ మృతులంతా మరణంలో చట్టబద్దంగా శాస్త్ర బద్దంగా దక్కాల్సిన గౌరవాన్ని కోల్పోతున్నారు. ఇందుకు బాధ్యులెవరు. దేశంలో బ్రతికేందుకు వీలైన పరిస్థితుల్లేవు. ఆఖరకు మృతిచెందినా గౌరప్రదమైన వీడ్కోలుకు నోచుకోవడంలేదు. ఈ పరిస్థితులకు కారణాలేంటి. దేశవ్యాప్తంగా పై నుంచి క్రిందవరకు యంత్రాంగం ఘోరంగా వైఫ ల్యం చెందింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, బ్రెజిల్‌, అమెరికాల్లో మొదటి తరంగం కేసులు అప్పట్లో ఉధృతంగానేవస్తున్నాయి. పైగా కోవిడ్‌ వైరస్‌లో ఉత్పరివర్తనాలు చోటు చేసుకుం టున్న విషయం కూడా వెలుగుచూసింది. పలురకాల వేరియంట్‌లు పుట్టుకొచ్చాయి. ఇవి తొలిదశ కంటే మరింత వేగంగా సంక్రమిస్తున్నాయని ప్రపంచం గుర్తించింది. పలు దేశాలు రెండో తంరాగన్ని ఎదుర్కొనేందుకు యుద్దప్రాతిపదికన ఏర్పాట్లు చేసుకున్నాయి. కానీ భారత్‌ ఈ దిశగా పూర్దిగా నిర్లక్ష్యం వహించింది.
తొలిదశ అనంతరం కోవిడ్‌పై భారత్‌ విజయం సాధించిందన్న ప్రచారాన్ని ఇప్పుడు అంతర్జాతీయ సమాజం, మీడియా తిప్పికొడుతు న్నాయి. భారత్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్ని ప్రపంచ మీడియా ఉతికి ఆరేస్తోంది. ఒకప్పుడు ఔషదాల నిలయంగా, టీకాల ఉత్పత్తి కేంద్రంగా, ప్రపంచానికి ఆరోగ్య సంరక్షణ ప్రదాయినిగా ప్రకటించుకున్న భారత్‌ని ఇప్పుడు అంతర్జాతీయ మీడియా రావణకాష్టం అంటూ విమర్శిస్తోంది. దేశంలో కోవిడ్‌ మృతదేహాల్ని రోడ్లపైనే వదిలేస్తున్నారు. శవాల గదులు నిండిపోయాయి. కొన్ని శవాలు కుళ్ళిపోతున్నాయి. ఆసుపత్రుల్లో పడకలందుబాటులో లేవు. తీవ్రమైన ఆక్సిజన్‌ కొరత రోగుల ప్రాణాలు తీసేస్తోంది. తగినన్ని మందులు అందుబాటులో లేవు. భారత్‌ మితిమీరిన ఆత్మవిశ్వాసమే ఈ పరిస్థితికి కారణమైందంటూ ఈ గార్డియన్‌ తన సంపాదకీయంలో మండిపడింది. ఫ్రెంచ్‌ దినపత్రిక లీమోండి తన సంపా దకత్వంలో భారత్‌లో ఆసుపత్రుల గేట్ల ముందు అంబులెన్స్‌లు బారులు దీరాయి. ఆక్సిజన్‌ కోసం రోగుల బంధుపుల ఆక్రంధనల్తో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. సామూహిక అంత్యక్రియలకు స్మశానవాటికలు వేదికలయ్యాయి. పట్టణాలు, పల్లెలు, పేద, గొప్ప తారతమ్యంలేదు. ప్రతి ఒక్కర్ని కరోనా వేదిస్తోందంటూ పేర్కొంది. కాగా అసమర్ధ పరిపాలన, మితిమీరిన జాతీయ వాదాలు ప్రస్తుత పరిస్థితికి దారితీశాయంటూ ది ఆస్ట్రేలియన్‌ విమర్శలు గుప్పించింది.
ఈ దుస్థితికి దూరదృష్టి లోపమే కారణమైంది. మొదటి తరంగంలో కేంద్రం యుద్దప్రాతిపదికన స్పందించింది. అయితే ఆ ఫలితాల్తో ఆత్మసం తృప్తి చెందింది. ఆ తర్వాత కోవిడ్‌ నమూనాల గుర్తింపునకు సమన్వయ ప్రయత్నం ప్రభుత్వం చేపట్టలేదు. ఇంగ్లాండ్‌లో డిసెంబర్‌ 21న కొత్త వేరియంట్‌ వెలుగుచూశాక కేంద్రం కొంతమేర స్పందించింది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సార్స్‌, కోవిడ్‌, జెనోమిక్స్‌ క న్సార్టియంను నెలకొల్పింది. దీనికనుబంధంగా పది పరిశోధ నాశాలల ఏర్పాటుకు ఆమోదం లభించింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో వెలుగుచూసే కోవిడ్‌ వేరియంట్‌లను గుర్తించి వాటి పనితీరును మదింపు చేయడం వీటి విధి. అప్పటికే భార‌త్‌లో ఉన్న బి 1.617 వేరియంట్‌ పరివర్తనాల్ని కూడా అంచనాలేయడం వీటి బాధ్యత. ఇందుకోసం 200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆర్ధికశాఖ ఈ ప్రాజెక్ట్‌కు 115కోట్లు మాత్రమే కేటాయించింది. అందులో 80కోట్లు మాత్రం ఈ ఏడాది మార్చి 31న విడ ుదల చేశారు. ఈలోగా భారతీయ ప్రయోగశాలలు ఉపయోగించే పరికరాలు, పలురకాల ప్లాస్టిక్‌ల దిగు మతులపై కేంద్ర ఆర్ధికమంత్రిత్వశాఖ నిషేదం విధించింది. దీంతో ఈ జినో మిక్స్‌ కన్సార్టి యంకు నిధుల్లేవు. కనీసం అరువు ప్రాతిపదికనైనా పరికరాల్ని సమకూర్చుకునే వెసులుబాటు లేదు. దీంతో ఈ ప్రయోగశాలలు ఏర్పాటైనా నిరర్ధకంగా మారాయి. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెలుగుచూసే వేరియంట్లను ట్రాక్‌ చేసేందుకు వీలుగా నమూనాలను పంపడంలో ఒక్క కేరళ మినహా మరే రాష్ట్రం ఆసక్తి చూపలేదు. ఇందు కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా నోడల్‌ అధికారుల్ని నియమించలేదు. ఇప్పటివరకు 80వేల నమూనాల్ని విశ్లేషించాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఇంతవరకు 3,500నమూనాల్ని మాత్రమే ఈ కన్సార్టియంకు చేరాయి.
మహారాష్ట్రలో కేసులు అధికమైన సందర్భంలో బి 1.617వేరియంట్‌ ఉత్పరివర్తనాలకు గురైందని ఈ కన్సార్టియం గుర్తించింది. ఇవి అధిక ఆం దోళన కలిగించే పరిస్థితుల్లో ఉన్నట్లు ఈ ఏడాది మార్చి 24నే ప్రకటిం చింది. అయితే దీనిపై కేంద్రం రాష్ట్రాలకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. దీన్ని కేంద్రం సీరియస్‌గా పరిగణించలేదు. అలాగే బి.1.617 మూడవ మ్యూటేషన్‌ సంకేతాలు పశ్చిమబెంగాల్లో వెలుగుచూశాయి. వైరస్‌ కొత్త వేరియంట్‌లో జన్యుశ్రేణి వేగంగా కదులుతున్నట్లు గుర్తించా రు. ఇది యుకె వేరియంట్‌కు దగ్గర్లో ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇలా కొత్త వేరియంట్లు గుర్తించిన సమయాల్లో ప్రత్యేక పరిశోధనల కోసం ఇంగ్లా ండ్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాలు అధిక మొత్తాల్లో నిధులు కేటాయిం చాయి. అలాగే ఆయా దేశాల్లోని జాతీయ ఆరోగ్య సంస్థలు రోగుల జినోమియంలను విశ్లేషించాయి. కేం బ్రిడ్జిలోని అడెన్‌బ్రూక్‌ హాస్పిటల్‌ వంటి వాటిని ఇందుకోసం ప్రత్యేకంగా కేటాయించాయి. జీనోమ్‌ సీక్వెన్స్‌ ద్వారా ఇతర విధానాల కంటే కనీసం రెండువారాల ముందుగా అప్రమత్తం చేసే వీలేర్పడేది. భారత్‌ జినోమిక్స్‌ కన్సార్టియంలను ఏర్పాటు చేసినప్పటికీ నిధుల మంజూరుతో పాటు పరికరాల్ని అందిచండంలో జరిగిన జాప్యం వైరస్‌ మ్యూటేషన్‌ను గుర్తించడంలో తీవ్ర ఆలస్యానికి కారణమైందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది చేజేతులా సృష్టించుకున్న ఉపద్రవంగా విశ్లేషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement