Sunday, May 19, 2024

ధోని సన్ ఆఫ్ సచిన్

ఎంఎస్‌ ధోనీ ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తు చేశారు. ఇంటర్వ్యూకు కూడా ఎంపికయ్యారు. అయితే ఆ దరఖాస్తులో ధోనీ తండ్రి పేరు సచిన్‌ టెండూల్కర్‌ అని ఉంది. అవును మీరు విన్నది నిజమే. ఈ వింత ఛత్తీస్‌గడ్‌లోని టీచర్ రిక్రూట్‌మెంట్‌లో జరిగింది. ఓ ఆకతాయి ఇంగ్లీష్ పోస్టు కోసం మహేంద్ర సింగ్ ధోని సన్నాఫ్ సచిన్ పేరుతో ఈ పని చేశాడు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసి ఇంటర్వ్యూ నిర్వహించే బృందం నోరెళ్లబెట్టింది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రక్రియలో చివరి దశ అయిన ఇంటర్వ్యూ దాకా ఈ దరఖాస్తు ఎలా వచ్చిందని వారు తల పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో శుక్రవారం 15 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించగా ఈ జాబితాలో ఎంఎస్‌ ధోనీ పేరు కూడా ఉంది. అయితే సదరు అభ్యర్థి ఇంటర్వ్యూకు హాజరు కాలేదు. అప్పటికిగానీ అధికారులు ఆ దరఖాస్తు నకిలీదని గుర్తించలేకపోయారు. దరఖాస్తులో పొందుపరిచిన నంబరుకు ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ వచ్చింది. నకిలీ దరఖాస్తుపై అధికారులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement