Monday, April 29, 2024

న్యూజిలాండ్‌తో భారత పర్యటన ఖరారు.. వైట్‌బాల్‌తో బిగ్‌ ఫైట్‌

ఆస్ట్రేలియాలో ఈ ఏడాది నిర్వహిస్తున్న టీ-20 ప్రపంచ కప్‌ తర్వాత న్యూజిలాండ్‌లో భారత క్రికెట్‌ జట్టు పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఆ పర్యటన సందర్భంగా న్యూజిలాండ్‌తో మూడు టీ-20 మ్యాచ్‌లను, మరో మూడు వన్డే మ్యాచ్‌లను ఆడనుంది. వైట్‌బాల్‌తో నిర్వహించే ఈ రెండు టూర్‌ షెడ్యూల్‌ వివరాలను న్యూజిలాండ్‌ క్రికెట్‌ (ఎన్‌జడ్‌సి) మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్‌ 18 వ తేదీ నుంచి 30వ తేదీల మధ్య నిర్వహించే ఈ సిరీస్‌లలో రెడు జట్లు తలపడనున్నాయి. ఆస్ట్రేలియాలో టీ-20 ప్రపంచకప్‌ పూర్తయిన వెంటనే న్యూజిలాండ్‌కు భారత జట్టు పర్యటిస్తుందని, వెల్లింగ్టన్‌, తౌరంగ, నేపియర్‌లలో మూడు టీ-20 మ్యాచ్‌లలో రెండు జట్లు తలపడతాయని వెల్లడించింది. ఇక ఆక్లాండ్‌, హేమిల్టన్‌, క్రిస్ట్‌చర్చ్‌లలో అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడతాయని ఆ ప్రకటనలో తెలిపింది. భారత్‌ జట్టు పర్యటన ముగిసిన అనంతరం న్యూజిలాండ్‌ జట్టు భారత్‌, పాకిస్తాన్‌లలో పర్యటించనుంది. ఆ తరువాత ఫిబ్రవరిలో తౌరంగా, వెల్లింగ్టన్‌లలో ఇంగ్లండ్‌తో జరిగే డేనైట్‌ మ్యాచ్‌లలో తలపడనుంది.

జులైలో వెస్టీండ్‌ పర్యటన..

మరోవైపు భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్‌ చేసిన ఐదవ టెస్ట్‌ మ్యాచ్‌లో జులై 1న తలపడనుంది. ఆ తరువాత వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. జులై -ఆగస్టు నెలల్లో మూడు వన్డేలు, ఐదు టీ-20 మ్యాచ్‌లలో ఆడనుంది. ఆస్ట్రేలియాలో జరిగే టీ-20 ప్రపంచకప్‌ నేపథ్యంలో భారత్‌ ఈ సిరీస్‌లకు అత్యంత ప్రాధాన్య ఇస్తోంది. మరోవైపు న్యూజిలాండ్‌ కూడా బిజీ షెడ్యూల్‌ను ప్రకటించింది. 2022-23లో ఇంగ్లండ్‌ సహా భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక పురుషుల జట్లు, బంగ్లాదేశ్‌ మహిళల జట్టు న్యూజిలాండ్‌ పర్యటనకు రానున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement