Tuesday, May 14, 2024

INDvsSA Test | సరిపోని యువ ఆటగాళ్ల అనుభవం.. టాప్‌ నుంచి ఆరో స్థానానికి పడిపోయిన భారత్‌

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ప్రయోగాల పేరుతో అనుభాగ్ఞులైన సీనియర్లకు బదులు యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం కూడా టీమిండియా ఓటమికి ప్రధాన కారణమని చెప్పోచ్చు. ఐదు రోజుల పాటు సుదీర్ఘంగా సాగే టెస్టు మ్యాచుల్లో పెద్దగా అనుభవంలేని యువ ఆటగాళ్లకు తీసుకుంటే ఫలితాలు కూడా అదేవిధంగా ఉంటాయని మాజీలతో పాటు భారత అభిమానులు సెలెక్టర్లపై మండిపడుతున్నారు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మెరుగ్గా రాణిస్తున్న టీమిండియా.. సఫారీ గడ్డపై జరిగిన తొలి టెస్టులో మాత్రం మూడు రోజుల్లోనే చాపచుట్టేసుకుంది. బౌన్సీ పిచ్‌పై ప్రత్యర్థి బౌలర్లు నిప్పులు చెరుగుతుంటే మన పేస్‌ దళం మాత్రం కసిలేని బౌలింగ్‌తో భారీ పరుగులు సమర్పించుకుంటుపోయింది. ఇక ఓటమికి అసలు కారణమైన బ్యాటింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే.

పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఎక్కువగా ఆడటంతో మన బ్యాటర్లు ప్రతిష్టాత్మకమైన టెస్టు క్రికెట్‌నే మర్చి పోతున్నట్లు ఉంది. ఎవరూ కూడా పిచ్‌పై నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేయలేదు. కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ తప్ప మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. వచ్చిన వారు వచ్చినట్టే మరీపోటీపడి పెవిలియన్‌కి క్యూ కట్టారు. సఫారీ బ్యాటర్లు అద్భుతంగా పోరాడుతున్న అదే పిచ్‌పై మన బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేసిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో మరింతగా దిగజారి 131 పరుగులకే కుప్పకూలడంతోపాటు ఇన్నింగ్స్‌ పరాజయాన్ని చవిచూసింది.

- Advertisement -

భారత్‌ తరఫున రెండు ఇన్నింగ్స్‌లలో కేఎల్‌ రాహుల్‌ (101) చేసిన పరుగులే అత్యధికం. విరాట్‌ కోహ్లీ 76 పరుగులతో రెండో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అదే సఫారీ జట్టులో డీన్‌ ఎల్గర్‌ (185), జాన్సెన్‌ (84 నాటౌట్‌), బెడింగ్‌హమ్‌ (56) చెలరేగి బ్యాటింగ్‌ చేశారు. దీంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగుల భారీ స్కోరుతో 163 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇక భారత సారథి రోహిత్‌ శర్మ తొలి ఇన్నింగ్స్‌ 5, రెండో ఇన్నింగ్స్‌లో (0) పరుగులే చేశాడు. రోహిత్‌ వైఫల్యం ఇతర బ్యాటర్లపై స్పష్టంగా కనిపించింది. జైస్వాల్‌ (17,5) రెండు ఇన్నింగ్స్‌లలో చేసిన స్కోర్లు.

అలాగే శుభ్‌మాన్‌ గిల్‌ (2, 26) పరుగులే చేయగలిగాడు. ఇలా టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు చెత్త ప్రదర్శనతో టీమిండియా రెండు ఇన్నింగ్స్‌లలో తక్కువ స్కోర్లకే పరిమితమైంది. ఇక బౌలింగ్‌లోనూ జస్ప్రీత్‌ బుమ్రా 4 వికెట్లతో పర్వాలేదనిపించినా.. సిరాజ్‌ 2 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. మరోవైపు యువ బౌలర్లు ప్రసిద్ధ్‌ క్రిష్ణ, శార్ధుల్‌ ఠాకుర్‌లు ఘోరంగా తేలిపోయారు. కసిలేని బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు సులభంగా పరుగులు చేసుకునెలా చేశారు. మరోవైపు సీనియర్‌ స్పిన్నర్‌ రవీచంద్రన్‌ అశ్విన్‌ సైతం తన సత్తాకు తగ్గట్టు ఆడలేక పోయాడు. విదేశి గడ్డపై అపార అనుభవం ఉన్నా దాన్ని సద్వినియోగించుకోలేక పోయాడు. కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే తీసి టీమిండియా ఓటమిలో తనవంతు పాత్ర పోషించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement