Sunday, May 5, 2024

పాకిస్తాన్‌-శ్రీలంక తొలి టెస్టులో లంక పట్టు.. పాక్‌పై 333 పరుగుల ఆధిక్యం

పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంక జట్టు పట్టు సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది. దీంతో 333 పరుగుల ఆధిక్యం సాధించింది. అంతకు ముందు పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే చేతులెత్తేసింది. తొలుత టాస్‌ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్‌ దిగి, తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులు చేసిన విషయం తెలిసిందే. తొలి రోజే గాలే వేదికగా ఇరు జట్ల బౌలర్లు రెచ్చిపోయి 12 వికెట్లు పడగొట్టారు. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే… 36/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక బ్యాటర్లు ఫెర్నాండో, రజిథ దూకుడు కొనసాగించారు. అయితే రజిథ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఫెర్నాండో (64) అర్ధసెంచరీతో రాణించాడు. ఆ తర్వాత కుశాల్‌ మెండిస్‌ (76), దినేష్‌ చండిమల్‌ 86 నాటౌట్‌తో మెరుపు దాడి చేశారు. ఇద్దరూ సమయోచితంగా ఆడుతూ జట్టు స్కోరు బోర్డు పరుగులెత్తించారు. యాసిర్‌ షాహ్‌ వేసిన యార్కర్‌కు కుశాల్‌ మెండిస్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధనంజయ డి సిల్వ (20), నిరోషన్‌ డిక్‌వెల్లా (12), రమేష్‌ మెండిస్‌ (22), మహీష్‌ థీక్షణ (11) తీవ్ర నిరాశపరిచారు. దినేష్‌ చండిమల్‌ (86నాటౌట్‌) ఒంటరి పోరాటం కొనసాగించాడు. శ్రీలంక గౌరవప్రదమైన స్కోరు చేయగల్గింది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 9 వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది. ప్రస్తుతం దినేష్‌ చండిమల్‌ 86, ప్రభాథ్‌ జయసూర్య 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక పాక్‌ బౌలర్లలో మొహమ్మద్‌ నవాజ్‌ 5 వికెట్లు పడగొట్టగా, యాసిర్‌ షాహ్‌ 3 వికెట్లు తీశాడు. మొత్తంగా శ్రీలంక 333 పరుగుల ఆధిక్యం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement