Thursday, April 25, 2024

పోలవరంతో తెలంగాణకు ముప్పు, బ్యాక్ వాట‌ర్ ఎగ‌త‌న్న‌డంతోనే వ‌ర‌ద‌పోటు.. హెచ్చ‌రిస్తున్న నిపుణులు

గోదావ‌రి న‌దికి గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా వ‌ర‌ద‌లు రావ‌డం ఒక ఎత్తైతే.. తెలంగాణ‌కు దిగువ‌న ఉన్న పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం వ‌ల్ల కూడా భ‌ద్రాచ‌లం వ‌ద్ద నీటి తాకిడి పెరిగింద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ప‌లువురు ఇంజినీర్లు, నీటి రంగంపై అవ‌గాహ‌న ఉన్న‌ నిపుణులు కూడా ఇదే విష‌యం స్ప‌ష్టం చేస్తుండ‌గా తాజాగా తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వీర‌మ‌ల్ల ప్రకాశ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే.. భద్రాచలం, బూర్గంపహాడ్ గ్రామం పూర్తిగా మునిగిపోతుందని ప్రకాశ్ అన్నారు. 67అడుగుల ఎత్తులో వరద ప్రవాహం కొనసాగితేనే రామాలయం వెళ్లేందుకు వీలు లేకుడా అష్టదిగ్భందనం అయ్యింద‌ని, అదే పొలవరం ప్రాజెక్టు క‌నుక‌ పూర్తయితే ఆ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా భద్రాచలం పూర్తిగా మునిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం విషయంలో సరైన అధ్యయనాలు జరగలేదని, ముఖ్యంగా బ్యాక్ వాటర్, డ్యామ్ సేఫ్టీ విషయంలో సరైన స్టడీస్ చేయకుండానే నిర్మాణ పనులు మొదలు పెట్టారని అన్నారు. ఈ అంశాలను అధ్యయనం చేసేందుకు అప్ప‌టి సీఎం, టీడీపీ అధినేత‌ చంద్రబాబు నిరాకరించారని ప్రకాశ్ ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టును తొందరగా కట్టాలనే ఉద్దేశంతో మొక్కుబడిగా స్టడీ చేపట్టి పనులు ప్రారంభించారని విమర్శించారు. ప్రస్తుతం ఈ డ్యామ్ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ పై స్టడీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పోలవరం పూర్తయితే కేవలం భద్రచలం మాత్రమే కాదని, తెలంగాణలో 100 కిలోమీటర్ల మేర ఎఫెక్ట్ పడుతుందని తెలంగాణ జ‌ల‌వ‌న‌రుల అభివృద్ధి సంస్థ చైర్మ‌న్‌ వీర‌మ‌ల్ల ప్ర‌కాశ్‌ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement