Thursday, April 25, 2024

సోనియాగాంధీకి ఈడీ నోటీసులకు నిరసనగా.. 21న ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ఆందోళన

హైెదరాబాద్‌, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వగా, ఈ నెల 21న ఈడీ విచారణకు హాజరవుతుండటంతో అదే రోజు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయాన్ని ముట్టడించాలని టీ పీసీసీ నిర్ణయం తీసుకున్నది. నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషిర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. ఈడీ కేసులను నిరసిస్తూ చేపట్టే ర్యాలీ విజయవంతానికి గాను సోమవారం గాంధీభవన్‌లో నగర కాంగ్రెస్‌ సమావేశం జరిగింది. టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజ్‌ శ్రావణ్‌, మాజీ మంత్రులు గీతారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, సునీతరావు తదితర నాయకులు, పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. బీజేపీ కావాలనే గాంధీ కుటుంబంపై కేసులు ఇబ్బందులకు గురి చేస్తున్నదని విమర్శించారు. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన కుటుంబానికి పెడుతున్న ఇబ్బందులను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థల ముందు నిరసనలు చేపడుతామన్నారు.

మాజీ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ.. ఈడీ ఆఫీస్‌ ముందు 21న చేపట్టే నిరసన కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసుల పేరుతో ప్రతిపక్ష నేతలకు వేదింపులు ఎక్కువైనాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని సోనియా, రాహుల్‌గాంధీలపై ఈడీ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. నిత్యావసర ధరలు, పెట్రోల్‌, డీజిల్‌, జీఎస్టీ పెంచి ప్రజలపై ఆర్థిక భారం వేస్తున్నారని గీతారెడ్డి మండిపడ్డారు. దేశాన్ని విభజించి పాలించాలని బీజేపీ చూస్తోందని, అందుకే రాహుల్‌గాంధీ భారత జోడో యాత్ర చేపడుతున్నారని ఆమె వివరించారు. ఈడీ కేసుల పేరుతో రాహుల్‌గాంధీని ఇప్పటికే రోజుల తరబడి విచారణ చేశారని, ఇప్పుడు సోనియాగాంధీని విచారించేందుకు 21న ఈడీ ఆఫీసుకు రావాలని నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి విమర్శంచారు. సోనియా, రాహుల్‌గాంధీలను కేసుల పేరుతో ఇబ్బందులు పెడితే కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడుతుందని బీజేపీ భావిస్తోందని ఆయన తెలిపారు. బీజేపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్‌ బలపడుతుందని, బలహీనపడదనే విషయం తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. మాజీ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. కేంద్రంలోని బీజేపీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement