Tuesday, May 14, 2024

Ranji trophy | రంజీ సెమీస్‌లో హైదరాబాద్‌..

హైదరాబాద్‌: రంజీట్రోఫీ-2024 ప్లేట్‌ గ్రూప్‌ విభాగంలో హైదరాబాద్‌ జట్టు సెమీస్‌లో ప్రవేశించింది. మిజోరంతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ 73 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో చిరస్మరణీయ విజయాలతో సంచలనాలు సృష్టిస్తున్న హైదరాబాద్‌ జట్టుకు ఇది వరుసగా ఐదో విజయం.

ఆడిన అన్ని మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో (35 పాయింట్లు) టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. హైదరాబాద్‌ 465/9 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయగా.. మిజోరం తొలి ఇన్నింగ్స్‌లో 199 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులే చేసి ఓటమిపాలైంది. రోహిత్‌ రాయుడు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. రెండు ఇన్నింగ్స్‌లలో రాయుడు 60 పరుగులు చేసి 6 వికెట్లు పడగొట్టి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.

ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్‌ మరో ఏడు పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అనంతరం 266 పరుగుల లోటుతో బ్యాటింగ్‌ ప్రారంభించిన మిజోరంకు హైదరాబాద్‌ బౌలర్లు చుక్కలు చూపెట్టారు. ముఖ్యంగా తనయ్‌ త్యాగరాజన్‌ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. ఇతని ధాటికి మిజోరం 43.1 ఓవర్లలో 193 పరుగులకే కుప్పకూలింది.

కెప్టెన్‌ రాత్లే (40; 49 బంతుల్లో 6 ఫోర్లు), మోహిత్‌ జంగ్రా (37; 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చివర్లో దూకుడుగా ఆడినా ఫలితంలేకుండా పోయింది. హైదరాబాద్‌ బౌలర్లలో తనయ్‌ 5 వికెట్లతో చెలరేగగా.. రోహిత్‌ 2 వికెట్లు పడగొట్టాడు. రవితేజ, కార్తికేయ, సాకేత్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. అంతకముందు హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో నితేశ్‌ రెడ్డి (115), కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌ (108) శతకాలతో మెరిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement