Friday, December 6, 2024

Cricket – రంజీ ఫైన‌ల్స్ లో విద‌ర్భ‌… 10న ముంబైతో ఢీ..

సెమీస్ లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ పై విజ‌యం..
చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ ..
93 ప‌రుగుల చేజింగ్ లో ఎంపి విఫ‌లం
మూడో సారి ఫైన‌ల్స్ కు చేరిన విద‌ర్భ

రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో విదర్భ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. చివరి రోజు వరకుఉత్కంఠగా సాగిన సెమీస్‌లో మధ్యప్రదేశ్‌ను ఓడించిన విదర్భ మూడోసారి రంజీ ట్రోఫీ ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఇక ఫైనల్‌లో ముంబైతో విదర్భ అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీస్‌ మ్యాచ్‌లో తమిళనాడుపై ముంబై గెలిచిన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో ముంబై 48వ సారి రంజీ ట్రోఫీ ఫైనల్లో అడుగుపెట్టింది. మార్చి 10న ముంబై, విదర్భ మధ్య ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది.

కాగా, శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌట్‌ అయింది. కరుణ్ నాయర్ (63) హాఫ్ సెంచరీతో రాణించాడు. మధ్యప్రదేశ్‌ బౌలర్ అవేశ్ ఖాన్ 4 వికెట్స్ పడగొట్టాడు. ఆపై తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్‌ 252 పరుగులు చేసింది. వికెట్‌ కీపర్‌ హిమాన్షు మంత్రి సెంచరీ (126) బాదాడు. 82 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంబించిన విదర్భ.. 402 పరుగులు చేసింది. యశ్‌ రాథోడ్‌ సెంచరీ (141) చేయగా.. అక్షయ్‌ వాడ్కర్‌ అర్ధ శతకం (77) బాదాడు. దాంతో మధ్యప్రదేశ్‌కు 321 పరుగుల లక్ష్యంను విదర్భ విధించింది.

మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. చివరి రోజు మధ్యప్రదేశ్‌ విజయానికి 93 పరుగులు అవసరం కాగా.. విదర్భ గెలుపుకు నాలుగు వికెట్లు అవ‌స‌రం అయ్యాయి. ఓవర్‌నైట్‌ స్కోరు 228/6 తో బుధవారం ఐదో రోజు ఆటను మొదలుపెట్టిన మధ్యప్రదేశ్‌ ఆరంభంలోనే వికెట్స్ కోల్పోయింది. కుమార్‌ కార్తికేయ (4), అనుభవ్‌ అగర్వాల్‌(6) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. ఆవేశ్‌ ఖాన్‌తో కలిసి సారాంశ్‌ జైన్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే సారాంశ్‌ 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్‌ అయ్యాడు. అనంతరం ఖెజ్రోలియా (11) కూడా బౌల్డ్‌ అవడంతో మధ్యప్రదేశ్ కు నిరాశ మిగిలింది.. దీంతో మధ్య ప్రదేశ్ 258 పరుగులకు అలౌటైంది…విదర్భ 62 పరుగుల తేడాతో విజయం సాదించి ముచ్చటగా మూడోసారి ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement