Tuesday, May 7, 2024

కెనడా ఓపెన్‌ విజేత లక్ష్యసేన్‌.. పురుషుల సింగిల్స్‌ బిడబ్ల్యుఎఫ్‌ టైటిల్‌ కైవసం

భారత స్టార్‌ షట్లర్‌, కామన్వెల్త్‌ క్రీడల ఛాంపియన్‌ లక్ష్యసేన్‌ కెనడా ఓపెన్‌లో చెలరేగాడు. తొలిసారి కెనడా ఓపెన్‌ చాంపియన్‌గా అవతరించాడు. సోమవారం హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఆల్‌ ఇంగ్లండ్‌ ఛాంపియన్‌ షై ఫెంగ్‌ (చైనా)పై లక్ష్యసేన్‌ విజయం సాధించాడు. 21-18 22-20 తేడాతో వరుస గేమ్‌లలో విజయం సాధించి ప్రత్యర్థిని చిత్తుచేశాడు. లక్ష్యసేన్‌కు ఇది రెండో బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ 500 టైటిల్‌ కావడం విశేషం. ప్రపంచ 19వ ర్యాంకర్‌గా ఉన్న లక్ష్యసేన్‌ 10వ ర్యాంకులో ఉన్న షై ఫెంగ్‌పై అసాధారణ ఆటతీరును కనబర్చి కెనడా ఓపెన్‌ను కైవసం చేసుకున్నాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచి అద్భుతమైన ఆటతో లక్ష్యసేన్‌ ప్రత్యర్థిని షాక్‌కు గురి చేశాడు.

వరుస సెట్లలో జోరు కొనసాగించాడు. ఈ సీజన్‌లో లక్ష్యసేన్‌కు ఇదే తొలి వరల్డ్‌ టూర్‌ టైటిల్‌. మొత్తంగా అతడికి రెండో బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ 500 టైటిల్‌. గతేడాది జనవరిలో లక్ష్యసేన్‌ ఇండియా ఓపెన్‌ విజేతగా నిలిచాడు. ఆ తర్వాత ఆగష్టులో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ముగిసిన తర్వాత లక్ష్యసేన్‌ ముక్కుకు శస్త్ర చికిత్స జరిగింది. ఆ తర్వాత కోలుకుని నిదానంగా ఆటలో పుంజుకున్న లక్ష్యసేన్‌ తాజాగా కెనడా ఓపెన్‌ విజేతగా ఆవిర్భవించి సత్తా చాటాడు.

- Advertisement -

మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ, ‘ఈ ఏడాది ఒలింపిక్స్‌కు క్వాలిఫై కావాలనుకున్న నాకు పరిస్థితులు కలిసి రాలేదు. కెనడా ఓపెన్‌ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కొన్ని మ్యాచుల్లో ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చింది. పరిస్థితులు కష్టంగా ఉండేవి. అయితే.. పరిస్థితులకు తగ్గట్టు ఆడడం అనేది చాలా ముఖ్యం. కెనడా ఓపెన్‌లో అదే చేశాను’ అని లక్ష్యసేన్‌ తెలిపాడు.

టర్నింగ్‌ పాయింట్‌..
ఈ టోర్నీలో లక్ష్యసేన్‌ అంచనాలకు మించి రాణించాడు. కీలకమైన సెమీఫైనల్లో అతను 11వ సీడ్‌ కెంట నిషిమొటోను చిత్తు చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. 44 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్‌ నిషిమొటోపై ఆధిపత్యం చెలాయించాడు. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా 21-17, 21-14తో గెలుపొందాడు. దాంతో, రెండోసారి డబ్ల్యూఎఫ్‌ సూపర్‌ 500 టైటిల్‌ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఈ విజయంతో జపాన్‌ ఆటగాడిపై తన రికార్డును 2-1కి మెరుగు పరుచుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement