Friday, May 3, 2024

IPL TICKETS : ఉప్ప‌ల్ లో బ్లాక్ మ్యాజిక్….

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ లో ఓవైపు పరుగుల వర్షం కురుస్తుంటే మరోవైపు మ్యాచ్‌ టికెట్ల విక్రయాల్లో ‘బ్లాక్‌’మ్యాజిక్‌ జరుగుతోంది. ఈనెల 25న ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ టికెట్ల రేట్లు బ్లాక్‌లో ఆకాశాన్నంటుతున్నాయి. టికెట్ల అమ్మకాల విషయంలో పారదర్శక విధానం లేకపోవడంతో 36 వేల టికెట్లను దాదాపు ఐదింతల ధరకు ఇష్టారీతిన నిర్వాహకులు విక్రయిస్తున్నారు.

- Advertisement -

టికెట్ల విక్రయాలు చేపట్టిన సంస్థ సబ్‌ ఏజెంట్లను నియమించుకొని రూ. 2 వేల టికెట్‌ను ఏకంగా రూ. 7,500 విక్రయిస్తోంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌ టికెట్లను రూ. 25 వేలకు బ్లాక్‌లో అమ్ముతోంది. ఇదే అదనుగా హెచ్‌సీఏ క్లబ్‌లకు కాంప్లిమెంటరీగా ఇచ్చిన టికెట్లను సైతం సెక్రటరీలు ఇష్టం వచ్చిన ధరలకు అమ్మకానికి పెట్టార‌నే ఆరోప‌ణ‌లు గుప్పు మంటున్నాయి

36 వేల టికెట్స్ క్ష‌ణాల‌లో గాయ‌బ్…
ఉప్పల్‌ స్టేడియం మొత్తం సీటింగ్‌ సామర్థ్యం 39,400. అందులో 10 శాతం టికెట్లను హెచ్‌సీఏకు ఇవ్వగా మిగిలిన టికెట్లను హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ ఎంపిక చేసిన పేటీఎం, దాని సబ్‌ ఏజెంట్లు విక్రయిస్తున్నాయి. ఎక్కడా ఆఫ్‌లైన్‌ టికెట్‌ కౌంటర్‌ సేల్స్‌ పెట్టకుండా టికెట్లను కేవలం కొన్ని క్షణాలపాటు ఆన్‌లైన్‌లో విక్రయించాయి. ఆ తర్వాత అంతా ‘బ్లాక్‌’మ్యాజికే. రూ. 1,750గా నిర్ధారించిన కనీస టికెట్‌ను రూ. 3 వేలకుపైగా, రూ. 2,500 టికెట్‌ను రూ. 7,500కు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. ఇక క్లబ్‌ హౌస్, సౌత్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌ టికెట్లయితే రూ. లక్షల్లో పలుకుతున్నాయి.

గ‌తంలో జ‌రిగిన మ్యాచ్ ల‌లోనూ ఇదే తంతు..
హైదరాబాద్‌లో జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ బ్లాక్‌ మార్కెట్‌పై అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించిందన్న ఆరోపణలు వినిపించాయి. ప్రభుత్వంలోని కీలక విభాగాలు, పోలీసు, రెవెన్యూ, విద్యుత్‌ తదితర శాఖలకు తగినన్ని కాంప్లిమెంటరీ పాస్‌లు ఇస్తున్నందుకే యంత్రాంగం బ్లాక్‌ మార్కెట్ ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ మాజీ చైర్మన్‌ ఎ.వెంకటేశ్వరరెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ క్రికెట్‌ అభిమానులను అవమానపరిచేలా టికెట్ల విక్రయం ఉందని విమర్శించారు. ఈ విషయంలో యంత్రాంగం తక్షణం స్పందించకపోతే 25న మ్యాచ్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆన్ లైన్ లో 36 వేల టికెట్స్ మూడు నిమిషాల‌లో అమ్మ‌కం ఎలా జ‌రిగిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement