Wednesday, May 1, 2024

Delhi | మీది కమీషన్ల కుటుంబం, మీ జీవితం కాంగ్రెస్ భిక్ష.. బీఆర్‌ఎస్ అవినీతికి బీజేపీ రక్షణ: రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కమీషన్ల కల్వకుంట్ల కుటుంబం అనుభవిస్తున్న జీవితం కాంగ్రెస్ భిక్ష అని ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి శుక్రవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఖర్గే కండువా కప్పి నారాయణరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను పోటీ చేసే స్థానాన్ని వంశీచంద్ రెడ్డి, నారాయణ రెడ్డికి ఇచ్చారని చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న వంశీచంద్తన నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారని వెల్లడించారు.

ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. బిల్లా రంగాల్లా బీఆర్ఎస్ నేతలు జనం మీద పడ్డారని రేవంత్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో అమల్లోకి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, రైతు రుణ మాఫీ, ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ వంటి పథకాలు మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా లేవని ఆయన తేల్చి చెప్పారు. ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్‌లో అమలు చేస్తున్న పథకాలు మీ దగ్గర ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. మీరేం చేశారో చెప్పుకోడానికి ఏమీ లేక కిరాయి మనుషులను తెచ్చుకుని కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఊచలు లెక్కబెట్టిస్తా, గుర్తు పెట్టుకోండంటూ ఆయన సవాల్ విసిరారు. ఓడిపోతే పారిపోదామని ఇతర దేశాల పాస్ పోర్ట్ లు తీసుకున్నారని, తమ పార్టీ అధికారంలోకి రాగానే విచారణ జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. తమ వద్ద పదవులు, ప్రభుత్వం లేకపోయినా కసిరెడ్డి, మైనంపల్లి, రేఖా నాయక్ పదవుల్లో ఉండి తమ దగ్గరకు వచ్చారని హర్షం వ్యక్తం చేశారు.
16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగిస్తే లక్షల కోట్ల అప్పులు మిగిల్చారని ఆయన మండిపడ్డారు. బీఆర్‌ఎస్ వాళ్లేం చెప్పినా ప్రజలు నమ్మరన్నారు. కమ్మ సామాజిక వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయని, టికెట్స్ ఇవ్వదగిన చోట ఇస్తామని, లేని చోట ఇతర పదవులు ఇస్తామని రేవంత్ స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చి అందరికీ న్యాయం చేస్తామని తేల్చి చెప్పారు. అంబలిలో తెడ్డులా ఉన్న బీజేపీకి అభ్యర్థులు, మేనిఫెస్టో లేదని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ స్టీరింగ్ అదానీ చేతిలో, బీఆర్ఎస్ స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉందని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ అవినీతికి బీజేపీ రక్షణ కల్పిస్తోందని రేవంత్ ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్-బీజేపీ మధ్య అవగాహన కుదిరిందని చెప్పుకొచ్చారు.

- Advertisement -

అసహాయ నేతగా మిగిలిపోయా-అందుకే పార్టీ మారా!!
అనంతరం కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ తనతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులు, ఇతర నేతలు పెద్దఎత్తున తరలివచ్చి కాంగ్రెస్‌లో చేరారని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందాలని, నిరుద్యోగం లేకుండా పోవాలని యువత కోరుకున్నా ఏ ఒక్కటీ జరగలేతని వాపోయారు. బీఆర్‌ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా కల్వకుర్తి మాత్రం అభివృద్ధి జరగడం లేదన్నారు. ప్రాజెక్టుకు కల్వకుర్తి పేరు పెట్టారు తప్ప నీళ్ళు మాత్రం పారలేదని, భూసమీకరణకు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు పోయాయి, ఆ కాలువ ద్వారా నీళ్లు రాలేదు, అక్కడి రైతులకు రైతుబంధు కూడా రావడం లేదని నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ పదవి ఉండి కూడా కల్వకుర్తికి ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని వివరించారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఎమ్మెల్యేకు మాత్రమే ప్రాధాన్యత ఉందన్నారు. తాను అక్కడ ఒక అసహాయ నేతగా మిగిలిపోయానని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీని వీడాల్సి వచ్చిందని కసిరెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ప్రజలకు పనికొస్తాయని తాను నమ్ముతున్నానని చెప్పారు. అందుకే కాంగ్రెస్‌లో చేరానని, తనను గెలిపించుకోవలసిన బాధ్యత ప్రజలపై ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే తన ప్రాంత అభివృద్ధికి శాయశక్తులా పని చేస్తానని నారాయణరెడ్డి హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement