Saturday, April 27, 2024

కాపు రిజర్వేషన్లపై వైసీపీ, టీడీపీలు మోసగించాయి : జీవీఎల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాపు రిజర్వేషన్లపై తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మోసగించాయని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. బుధవారం రాజ్యసభలో ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి ప్రతిమా భూమిక్ బదులిచ్చారు. కేంద్ర ప్రభుత్వ సమాధానం అనంతరం ఒక ప్రకటన విడుదల చేసిన జీవీఎల్.. కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో రెండు పార్టీలూ మోసగించాయని విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా ఈ మోసం బట్టబయలైందని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 ఎ(3) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను కల్పించే అధికారం ఆయా రాష్ట్రాలకు ఉందని కేంద్ర మంత్రి సమాధానంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఏ కులానికైనా ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు.

ఆ రకంగా కాపులకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉందని అన్నారు. 1993 నుంచి కేంద్ర ప్రభుత్వం విడిగా, రాష్ట్ర ప్రభుత్వాలు విడిగా రిజర్వేషన్లు కల్పిస్తున్న కులాల జాబితాలు కలిగి ఉన్నాయని, వాటి ప్రకారం తాము అనుకున్న కులాలకు రిజర్వేషన్ కల్పించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపు సామాజిక వర్గానికి బీసీ రిజర్వేషన్లు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన విధానం గురించి జీవీఎల్ ప్రశ్నించగా  సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు (SEBC) రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ 2021లో చేసిన 105వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినట్టు చెప్పారు. ఆ మేరకు ఆర్టికల్ 342 ఎ(3) ప్రకారం అటువంటి కులాల ప్రత్యేక జాబితాను తయారు చేసి, వారికి రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెట్టినట్టు వివరించారు.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పదేపదే చెబుతూ కాపులను తప్పుదోవ పట్టించి వైసీపీ, టీడీపీలు దశాబ్దాలుగా మోసం చేశాయని జీవీఎల్ ఆరోపించారు. ఇది కాపులపై వారికున్న కపట ప్రేమకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో వైసీపీ, టీడీపీ అబద్ధాలు బట్టబయలయ్యాయని, ఇంకా కాపులను మోసం చేయటం వారికి సాధ్యం కాదని జీవీఎల్ వ్యాఖ్యానించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement