Monday, May 6, 2024

మోదీ విఫలం: ప్రపంచ మీడియా విమర్శలు

ఇండియాలో కరోనా కేసుల విజృంభణకు ప్రధాని నరేంద్ర మోదీ వైఫల్యమే కారణమని ప్రపంచ మీడియాలో విమర్శలతో కూడిన వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో నమోదవుతున్న కేసుల్లో సగం కేసులు ఇండియా నుంచే వస్తున్నాయని, ఆసుపత్రుల్లో పడకలు దొరకడం లేదని, ప్రజలు నడిరోడ్డుపైనే మరణిస్తున్నారని, ఇది అత్యంత కలవరపరిచే అంశమని ప్రపంచ మీడియా లో కథనాలు వస్తున్నాయి. గత అక్టోబర్ లోనే కరోనా సెకండ్ వేవ్ పై హెచ్చరికలు జారీ చేసినా, కుంభమేళాలు, జాతరలతో పాటు ప్రార్థనా మందిరాలు, మాల్స్, సినిమా హాల్స్ తదితరాలను తెరిచారని, దీంతో ప్రజల మధ్య బౌతిక దూరం తగ్గిపోయి, మహమ్మారి ఉద్ధృతి సునామీని తలపిస్తోందని విదేశీ పత్రికలు అభిప్రాయపడ్డాయి.

కరోనా తొలి దశలో ఎన్నో దేశాలకు సాయం అందించి, ఔషధాలను, వ్యాక్సిన్లను పంపించిందని కొనియాడని పత్రికలు, ఇప్పుడు ప్రభుత్వ పెద్దల విధానాలతోనే ఇండియాలో కరోనా కేసులు అపరిమిత స్థాయికి పెరిగాయని కథనాలను ప్రచురిస్తున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఉన్న కేంద్రం, జాగ్రత్తలను గాలికి వదిలేసిందని, రెండో వేవ్ మరింత ప్రమాదకరంగా ఉంటుందని తెలిసినా సన్నద్ధంగా లేదని విమర్శిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement