Saturday, April 27, 2024

ODI | శ్రీలంకకు వరల్డ్‌కప్‌ బెర్తు.. జింబాబ్వేపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం

ప్రపంచకప్‌కు అర్హత సాధించే క్రమంలో ఆదివారం జింబాబ్వేతో జరిగిన కీలక పోరులో లంకేయులు గర్జించారు. సూపర్‌ సిక్స్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో జింబాబ్వేను 9 వికెట్ల తేడాతో చిత్తుచేశారు. బౌలింగ్‌లో మహీశ్‌ తీక్షణ నాలుగు వికెట్లు తీయగా, బ్యాటింగ్‌ పథుం నిశాంక సెంచరీతో కదంతొక్కి జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు. టాస్‌ నెగ్గిన శ్రీలంక తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఆఫ్‌ స్పిన్నర్‌ తీక్షణ 4-25తో రాణించగా, ఎడమచేతి పేసర్‌ మధుశంక 3-15తో నిప్పులు చెరగడంతో జింబాబ్వే 165 పరుగులకే చాపచుట్టేసింది.

- Advertisement -

లక్ష్య ఛేదనలో నిస్సాంక అజేయ సంచరీతో కదం తొక్కాడు. 102 బంతుల్లో 101 పరుగులు చేశాడు. దిముత్‌ కరుణరత్నె (30), కుశాల్‌ మెండిస్‌ (25నాటౌట్‌) అతడికి సహాయంగా నిలిచారు. దాంతో 101 బంతులు మిగిలివుండగానే శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సూపర్‌సిక్స్‌ పాయింట్ల పట్టికలో శ్రీలంక అగ్రస్థానంలో నిలిచి, ప్రపంచకప్‌ టోర్నీలో బెర్తు ఖాయం చేసుకుంది.

సంక్షిప్త స్కోర్లు:

జింబాబ్వే: 165 (135.2 ఓవర్లు) సీన్‌ విలియమ్స్‌ 56,సికిందర్‌ రజా 31. మహీశ్‌ తీక్షణ 4-25, మధుశన్క 3-15.
శ్రీలంక: 169/1 (33.1ఓవర్లు) నిస్సాంక 101 నాటౌట్‌, కరుణరత్నె 30. ఎంగర్వ 1-35.

Advertisement

తాజా వార్తలు

Advertisement