Tuesday, October 1, 2024

సమస్యలపై అంగన్‌వాడీల సమరం… 10,11 తేదీల్లో కలెక్టరేట్ల వద్ద నిరస

అమరావతి, ఆంధ్రప్రభ: తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు సమరానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దశలవారీగా చేస్తున్న పోరాటాన్ని మరింత ఉదృతం చేసేందుకు యూనియన్లు పిలుపునిచ్చాయి.ఐసిడిఎస్‌ పరిరక్షణ, అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పెన్షన్‌, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, గ్రాట్యూటీ అమలు చెయ్యాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 10,11 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద 36గంటల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంగన్‌వాడీల కోర్కెల దినంగా జులై 10న పాటిస్తూ దేశ వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేయాలని అఖిలభారత కమిటీ ఇప్పటికే ఈ మేరకు పిలుపునిచ్చింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9ఏళ్లయినా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించలేదనీ, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించని పరిస్థితి ఉందని అంగన్వాడీ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఐసిడిఎస్‌ లక్ష్యానికి విరుద్ధంగా సెంటర్లు కుదించటానికి కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని తీసుకువచ్చిందని మండిపడుతున్నారు. ప్రభుత్వ విధానాల వల్ల పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు అనేక రెట్లు పెరిగాయని, అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు మాత్రం ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు.గతంలో తాము చేసినఅనేక పోరాటాలు ఫలితంగా 2018 లో అంగన్వాడీ వర్కర్లకు రూ.1500, హెల్పర్లకు రూ .750, మినీ వర్కర్‌ లకు రూ.1250 పెంచుతున్నామని ప్రభుత్వాలు ప్రకటన చేసినా, వాటిని ఇంత వరకు అమలు చేయలేదని అంగన్వాడీ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

అలాగే సుప్రీంకోర్టు అంగన్వాడీ ఉద్యోగులు 1972 చట్టం ప్రకారం గ్రాట్యూటీకి అర్హులని స్పష్టం చేసినా ప్రభుత్వం ఆ తీర్పును అమలు చేయడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇంకోవైపు అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులను కుదించటానికి పోషణ ట్రాక్‌ యాప్‌ను తీసుకువచ్చిందని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో వర్కర్ల పై అదనపు పని భారం వేస్తూ రకరకాల యాప్లు తీసుకువచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తు తున్నారు.అంగన్వాడీలకు తెలంగాణ లో కన్నా అదనంగా వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చారని,నాలుగేళ్లుగా ఆ హామీ నీటి మీద రాతగా మిగిలిందని ఆవేదన వెలిబుచ్చుతున్నారు.

అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ పేరుతో అధికారులు, రాజకీయ నాయకులు అంగన్‌వాడీ కార్యకర్తలు,వర్కర్లను వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడుతున్నారు. స్కీంవర్కర్లు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం బిల్లులను కూడా సకాలంలో చెల్లించడం లేదని,వేతనాలు కూడా సకాలంలో చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు.ఈ నేపధ్యంలో అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌ తో ఈ నెల 10, 11 తేదీల్లో 36 గంటలు (పగలు, రాత్రి) కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు- యూనియన్‌ నాయకులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement