Sunday, April 28, 2024

Big story | మహిళల చూపు పీజీ వైపు.. ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్ ల‌లో వారే అధికం!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మహిళలు ఉన్నత విద్యలో రాణిస్తున్నారు. డిగ్రీ తర్వాత చాలా మంది పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (పీజీ) చేయడానికి ఇష్టపడుతున్నారు. ఒకప్పటి పరిస్థితికి పూర్తిభిన్నంగా మహిళలు ఉన్నత చదువులు చదివేందుకు ముందుకు వస్తున్నారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కూడా వారిని ప్రోత్సహిస్తున్నారు. ఎంఏ, ఎంకామ్‌, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సులు చేస్తున్నవారిలో మహిళలే అత్యధికంగా ఉంటున్నారని అధికారులు చెబుతున్నారు. పీజీ సీట్ల భర్తీకి నిర్వహించిన కామన్‌ పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌) ఫలితాల్లో ఇదే స్పష్టమైంది.

తెలంగాణలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలలో పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన కామన్‌ పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో మొత్తం 93.42 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ మంగళవారం నాడు మాసాబ్‌ ట్యాంక్‌లోని కార్యాలయంలో వైస్‌ ఛైర్మన్లు వి.వెంకటరమణ, ఎస్‌కె. మహమూద్‌, కార్యదర్శి శ్రీనివాస్‌రావు, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ డి.రవీందర్‌తో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ మహిళా యూనివర్సిటీలతో పాటు హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో పీజీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ, పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించారు.

అయితే మొత్తం 68,422 మంది ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా అందులో 22,468 మంది పరుషులు ఉంటే, మహిళలు మాత్రం అత్యధికంగా 45,954 మంది చేసుకోవడం గమనార్హం. అదేవిధంగా 19,435 మంది పురుషులు పరీక్షకు హాజరు కాగా, మహిళలు 40,230 మంది హాజరయ్యారు. వీరిలోనూ వివిధ పీజీ కోర్సుల్లో 18,172 మంది పురుషులు ఉత్తీర్ణత సాధిస్తే, మహిళలు 37,567 మంది ఉత్తీర్ణత సాధించారు. అంతేకాకుండా ఉస్మానియా యూనివర్సిటీతోపాటు రాష్ట్రంలోని మిగతా యూనివర్సిటీల్లోనూ పీజీ కోర్సులు చేస్తున్నవారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

మహిళలు విద్యలో రాణించడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మీ, షాదీముబార్‌, సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలు, కళాశాలలే కారణమని అంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్న భరోసాతోనే తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనే పట్టుదలతో తల్లిదండ్రులు కూడా ముందుకు వస్తున్నారని విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి, ఓయూ వీసీ రవీందర్‌ పేర్కొన్నారు. ఈక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఉన్న బాయ్స్‌ హాస్టళ్లను గతేడాది మాదిరిగానే ఈ విద్యాసంవత్సరం కూడా మహిళలకే కేటాయించనున్నట్లు తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థుల్లో దాదాపు 70 నుంచి 80 శాతం వరకు మహిళా స్టూడెంట్లే ఉండడం విశేషం. సీపీగెట్‌లో ఉత్తీర్ణులైన 37,567 మంది మహిళల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఓసీలో-4031 మంది, బీసీ-ఏలో 2768 మంది, బీసీ-బీ-6694, బీసీ-సీ-238, బీసీ-డి-7192, బీసీ-ఈ-3171 మంది మహిళలు ఉన్నారు. ఎస్సీ నుంచి 9382, ఎస్టీ నుంచి 4091 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా పురుషులు, మహిళలు కలిపి 59,665 మంది పరీక్షకు హాజరుకాగా, 55739 (93.42 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement