Saturday, May 18, 2024

Delhi | బీసీ నేతల బాటలో మహిళా కాంగ్రెస్.. మహిళలకు టికెట్ల కోసం ఫైట్, నాయకత్వంపై ఒత్తిడి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు పాసైన వేళ వివిధ రాజకీయ పార్టీల్లో మహిళలకు తగినంత ప్రాతినిథ్యం, ప్రాధాన్యత కల్పించాలన్న డిమాండ్ పెరుగుతోంది. బీసీ నేతల మాదిరిగానే మహిళా కాంగ్రెస్ నేతలు టికెట్ల కోసం రాష్ట్ర నాయకత్వంతో పాటు అధిష్టానంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. జనాభా నిష్పత్తి ప్రకారం బీసీల సంఖ్య 50 శాతం పైగా ఉందని, ఈ పరిస్థితుల్లో తమకు వీలైనన్ని ఎక్కువ సీట్లు కేటాయించాలని టీ-కాంగ్రెస్ బీసీ నేతలు గత వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసి అధిష్టానంపై ఒత్తిడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీలో ఏ ఒక్కరూ వారికి అపాయింట్మెంట్ ఇవ్వకపోగా.. ఏదున్నా పార్టీలో చెప్పాలి తప్ప మీడియా ముందుకు వెళ్లొద్దంటూ అధిష్టానం గట్టిగా హెచ్చరించింది. ఈ పరిణామాల దృష్ట్యా మహిళా కాంగ్రెస్ నేతలు బృందంగా ఏర్పడి ఢిల్లీకి రావాలన్న ఆలోచన మానుకున్నప్పటికీ హైదరాబాద్ నుంచే అటు రాష్ట్ర నాయకత్వం, ఇటు అధిష్టానంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

- Advertisement -

మహిళా బిల్లు స్ఫూర్తితో…

మహిళా రిజర్వేషన్ల బిల్లు స్ఫూర్తితో తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు మహిళా సీట్ల కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. రాష్ట్రస్థాయిలో జరిగిన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో మాజీ ఎంపీ రేణుక చౌదరి, సునీత రావుగా తమ గళం గట్టిగా వినిపించారు. మహిళల ఓట్లకు గాలం వేసేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మహిళా బిల్లును తెచ్చినప్పటికీ, దాన్ని వెంటనే అమలు చేయకుండా జనగణన, డీలిమిటేషన్‌తో ముడిపెట్టినందున.. సీట్ల కేటాయింపులో మహిళా బిల్లు స్ఫూర్తిని అమలు చేయాలని సునీత రావు డిమాండ్ చేశారు. ఆ ప్రకారం మొత్తం సీట్లలో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించాలని, తద్వారా జనాభాలో సగం ఉన్న మహిళలను ఆకట్టుకోవచ్చని చెప్పినట్టు తెలిసింది.

మహిళలు అనేసరికి సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న కుటుంబాల్లోని మహిళలను ముందుకు తీసుకొస్తున్నారని, పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పోరాడుతూ కేసులను ఎదుర్కొంటూ కష్టపడ్డ మహిళా కాంగ్రెస్ నేతలకే ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. నేతలు తమ సీట్లను త్యాగం చేసైనా సరే మహిళలకు సీట్లు కేటాయించాలని, అలాగే మహిళా అభ్యర్థులకు పార్టీ నుంచి ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించి గెలిపించాలని రేణుక చౌదరి మాట్లాడినట్టు తెలిసింది. మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వలేకపోయినా.. కనీసం 25 సీట్లైనా ఇవ్వాల్సిందేనని ఆమె గట్టిగా పట్టుబట్టినట్టు సమాచారం.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యం చేసుకుంటూ మహిళలకు తగినంత ప్రాతినిధ్యం ఉండాలని, అవసరమైతే తన సీటును మహిళకు ఇవ్వడానికి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. నిజానికి 70 మందికి పైగా ఉన్న మహిళా కాంగ్రెస్ విభాగం నుంచి 21 మంది రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా రాజకీయానుభవం కల్గినవారు కూడా ఉన్నారు. అయితే ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ (పీఈసీ)లో మొత్తం 119 నియోజకవర్గాల్లో 11 సీట్లలో మాత్రమే మహిళల పేర్లను ప్రస్తావించగా.. వారిలో ఆరుగురు అప్పటికే రాజకీయాల్లో ఉన్న కుటుంబాలకు చెందినవారే ఉన్నట్టు తెలిసింది. ఇంత తక్కువ సంఖ్యలో మహిళలకు సీట్లిస్తే ఎలా అన్నదే మహిళా కాంగ్రెస్ నేతల నుంచి ఎదురవుతున్న ప్రశ్న.

గెలవలేని సీట్లు కేటాయింపుల్లో సాకులు.. మమ అనిపించుకునే యత్నాలు

కాంగ్రెస్ పార్టీ ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం సామాజిక సమతుల్యత పాటిస్తూ వెనుకబడిన వర్గాలు, మహిళలకు తగినంత ప్రాతినిథ్యం కల్పించాలి. అలాగే ఒక కుటుంబం నుంచి ఒకరి మించి టికెట్లు ఇవ్వరాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నిబంధనలకు మినహాయింపులు ఉన్నాయి. అయితే టీపీసీసీ నాయకత్వం గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని, గెలుపు అవకాశాలే ప్రామాణికంగా తీసుకోవాలని అధిష్టానాన్ని ఒత్తిడి చేస్తోంది. సర్వే నివేదికలు, ఆర్థిక బలం తదితర అంశాలను తమ వాదనకు బలాన్ని చేకూర్చేలా అధిష్టానం ముందు పెడుతోంది. అలాగని బీసీ నేతలు, మహిళలకు పూర్తిగా టికెట్లు నిరాకరించే అవకాశం కూడా లేదు.

అయితే పార్టీకి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న నియోజకవర్గాలు, గత కొన్ని దశాబ్దాల్లో వరుసగా ఓటమిపాలవుతూ వచ్చిన స్థానాలను బీసీలకు, మహిళలకు ఇచ్చి నాయకత్వం మమ అనిపించుకుంటోందని ఈ రెండువర్గాల నేతలు ఆరోపిస్తున్నారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సునీత రావు తనను గోషామహల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలనుకుంటున్నారని, అక్కడ మహిళలు స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే పరిస్థితి కూడా ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందూత్వ భావజాలం ఎక్కువగా ఉన్న ఆ ప్రాంతంలో రాజా సింగ్ వంటి నేతలు వరుసగా విజయం సాధిస్తున్నారు. గతంలో ముఖేశ్ గౌడ్ ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్‌కు గట్టి పట్టుండేది.

ఇప్పుడు కాంగ్రెస్ పట్టు కోల్పోయిన ఈ స్థానాన్ని తనకు కేటాయించి, ఇచ్చామంటే ఇచ్చాం అన్నట్టుగా రాష్ట్ర నాయకత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని సునీత రావు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించగా.. టికెట్ల కేటాయింపు తమ చేతుల్లో లేదని, ఢిల్లీలో హైకమాండ్‌తోనే తేల్చుకోవాలని చెప్పి తప్పించుకున్నట్టు తెలిసింది. అందుకే ఆమె మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు నెట్టా డిసౌజాతో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్‌కు ఫోన్ చేయించి మరీ ఒత్తిడి చేసినట్టు తెలిసింది. ఆమె దరఖాస్తులో ఖైరతాబాద్ నియోజకవర్గం టికెట్ కోరుకున్నప్పటికీ సెకండ్ ఆప్షన్‌గా సికింద్రాబాద్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.

ఒకవేళ అక్కడ కుదరదు అంటే అంబర్‌పేట్ నుంచైనా అవకాశం కల్పించాలని సునీత డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు టికెట్ల కోసం పోరాడుతున్న సీనియర్ నేత వీ.హెచ్ ఈ విషయంలో బీసీ మహిళా నేతగా తనకు మద్దతివ్వాలని కోరుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడా కుదరని పక్షంలో పాత మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ఎక్కడిచ్చినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆమె అధిష్టానానికి సంకేతాలు పంపినట్టు తెలిసింది. ఆ జిల్లాలో తన సామాజికవర్గమైన ముదిరాజ్ జనాభా ఎక్కువగా ఉందని, అందుకే ఆ జిల్లా అడుగుతున్నానని సునీత చెబుతున్నారు. రాష్ట్ర జనాభాలో అత్యధిక జనాభా కల్గిన ముదిరాజ్ సామాజికవర్గానికి కనీసం 5 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని, కానీ కేవలం రెండు సీట్లు మాత్రమే ఇస్తున్నారని, వారిలో ఒకరు ఈమధ్యనే పార్టీలో చేరిన ఎర్రశేఖర్ (జడ్చర్ల) అని ఆమె చెబుతున్నారు.

నిజానికి జడ్చర్లలో చాలాకాలంగా పనిచేస్తున్న శ్రీహరి ముదిరాజ్‌కు అవకాశం ఇవ్వకుండా ఎర్ర శేఖర్‌కు ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. సునీత బాటలో మరికొందరు మహిళా కాంగ్రెస్ నేతలు టికెట్లు ఆశిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఆశిస్తున్న మహబూబాబాద్ స్థానం నుంచి నునావత్ రాధ ధరఖాస్తు చేసుకున్నారు. సుదీర్ఘకాలంగా పార్టీలో పనిచేస్తున్న ఆమెకు 3 సార్లు టికెట్ నిరాకరించిన పార్టీ ఈసారైనా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఖానాపూర్ నియోజకవర్గం నుంచి చారులత రాథోడ్ టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ ప్రతిసారీ పారాచ్యూట్ నేతలకే టికెట్లు ఇస్తున్నారని, ఎంతోకాలంగా పార్టీలో ఉన్నవారిని విస్మరించి చివరి నిమిషంలో పార్టీలో చేరినవారికి టికెట్ ఇవ్వడం సరికాదని మహిళా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

జెడ్పీటీసీగా పనిచేసిన అనుభవం ఉన్న చారులత రాథోడ్‌కే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ నుంచి బీసీ మహిళ గోపగాని మాధవి టికెట్ ఆశిస్తుండగా.. అక్కడ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి తన ఇద్దరు కొడుకుల్లో ఒకరి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. చేవెళ్ల నుంచి పార్టీ సీనియర్ మహిళా నేత సులోచన టికెట్ ఆశిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం వరకు మహిళలకు సీట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎందుకు ఆ మాదిరిగా ఇవ్వడం లేదని మహిళా కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

కనీసం దరఖాస్తు చేసుకునే దశలోనే మహిళల్ని ముందుకురాకుండా చేస్తున్నారని, దరఖాస్తు ఫీజులోనూ మహిళలకు మినహాయింపు ఇవ్వలేదని వాపోతున్నారు. తమ కష్టార్జితం పోగేసుకుని దరఖాస్తు చేసుకున్న మహిళా కాంగ్రెస్ నేతలకు టికెట్లు నిరాకరించినపక్షంలోనైనా దరఖాస్తు ఫీజును తిరిగివ్వాలని కొందరు నేతలు అడుగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement