Saturday, May 18, 2024

Big Story: మిషన్‌ కాకతీయతో.. పల్లెలు నీటి ముల్లెలైనయ్​!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : నీరు జీవనాధారం, ప్రాణాధారం, నీరు మానవాళి మనుగడకు ఆధారం. నీరున్న చోటే ప్రజా సమూహాలు ఆవాసం ఏర్పరుచుకున్నాయి. నాగరికత ప్రస్తుతం అభివృద్ధి చెందింది, అందుకే మనిషి జీవనంతో జల వనరులు ముడిపడ్డాయి. రాజుల కాలంలో కేవలం వర్షపు నీటిని ఒడిసిపట్టి వివిధ అవసరాలకు వినియోగించేవారు. చరిత్ర ఇదే చెబుతోంది. బావులు, చెరువుల తవ్వకం శాతవాహనులకు కాలంలో ఒక కార్యక్రమంగా ఉన్నప్పటికీ కాకతీయుల జమానాలో సాంకేతికతను జోడించి చెరువులను నిర్మించారని పెద్దలు చెబుతుంటారు. ఆ తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగింది. తెలంగాణ ప్రాంతమంతటా కాకతీయులు, కుతుబ్‌ షాహీలు, ఆసిఫ్‌ జాహీలు నిర్మించిన చెరువుల స్ఫూర్తితో తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం చిన్న నీటి వనరులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మిషన్‌ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరణ, పునర్నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.

తెలంగాణాకు చెరువులు, బావులే ప్రధానాధారం. తెలంగాణ ప్రాంత భౌగోళిక స్వరూపం, వర్షపాత విధానం చెరువుల ద్వారా నీరు నిలువచేసి వ్యవసాయానికి వినియోగించుకునే పద్ధతి ఆదర్శవంతంగా నిలిచింది. రాష్ట్రంలో చిన్న నీటి పారుదలకు 255 టీఎంసీల నీటిని కేటాయించి 25 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాల్సి ఉండగా అందులో కేవలం 9 నుంచి 10 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేది. చెరువులలో పూడిక పేరుకుపోయి నీటి నిలువ సామర్థ్యం తగ్గడం, తూములు శిథిలాస్థకు చేరడం, చెరువు కట్టలు బలహీనపడటం, ఫీడర్‌ ఛానల్స్‌ పని చేయకపోవడం, కాలువలకు మరమ్మతులు లేకపోవడం వంటి కారణాలతో చెరువులు, చిన్ననీటి వనరులు ఆశించిన స్థాయిలో నీరందించలేదు. పైగా చాలా సంవత్సరాలు నిర్వహణ సరిగా లేకపోవడంతో పూడిక పేరుకుపోయింది.

రాష్ట్రంలో 46,531 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిని దశల వారీగా పునరుద్ధరించాలనే లక్ష్యంతో మిషన్‌ కాకతీయకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి ఏటా 20 శాతం చెరువులను ఐదేళ్లలో పునరుద్ధరించాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 2015 మార్చి 12న మిషన్‌ కాకతీయకు అంకురార్పణ చేశారు.
ఐదేళ్లపాటు కొనసాగిన మిషన్‌ కాకతీయ పథకంతో ప్రభుత్వం 27,665 చెరువులు పునుద్ధరించింది. 15 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించింది. ఇందుకోసం రూ.5,309 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. 8.93 టీఎంసీల నీటిని నిలువ చేసే సామర్థ్యం పునరుద్ధరించింది. చెరువుల కట్టలను మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా బలోపేతం చేయడంతో నీరు వృధాగా పోకుండా అరికట్టగలిగింది. అన్ని రకాల నీటి సంరక్షణ చర్యలు ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లు, చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలమట్టం 4.14 మీటర్లకు పెరిగింది.

మిషన్‌ కాకతీయతో ప్రయోజనాలెన్నో…

మిషన్‌ కాకతీయకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో ఎన్నో ప్రయోజనాలు ఏర్పడ్డాయి. చెరువుల్లో ఉన్న పూడికను తొలగించడంవల్ల భూగర్భ జలాలు పెరిగాయి. ఫలితంగా చెరువు నీటి సామర్థ్యం కూడా పెరిగిందని ఈ రంగంలో నిష్ణాతులు చెబుతున్నారు. భూగర్భ జల్లాలో ఫ్లోరైడ్‌ శాతం తగ్గడంతో పాటు పూడిక మట్టిని ఎరువుగా వినియోగించడంవల్ల పొలాల్లో రైతులు తరచూ చల్లే ఎరువుల వాడకం తగ్గిందని చెప్పారు. పత్తి, మిరప మొదలగు పంటల దిగుబడి 20 నుంచి 30 శాతానికి పెరిగిందని, వరి దిగుబడి 19.60 శాతం పెరిగిందని చెప్పారు. చెరువుల ద్వారా తీసిన 2,721 లక్షల క్యూబిక్‌ మీటర్ల పూడిక మట్టిని రైతులు తీసుకువెళ్లి ప్రభుత్వానికి రూ.1,088 కోట్లు ఖర్చు చేయకుండా పొదుపు చేశారని సంబంధిత అధికారులు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,939 చెరువులలో 27 కోట్ల చేప పిల్లలను వదలడంతో 85వేల టన్నుల చేపలు పెరిగి మత్స్యకారులకు 2016-17లో రూ.480 కోట్ల ఆదాయం వచ్చిందని, 20 లక్షల ఈత చెట్లను చెరువు కట్టలపై నాటడంవల్ల కల్లు, గీత పని వారికి ఆదాయం మెరుగైందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వేసవి కాలంలో సహజంగా ఏర్పడే నీటి ఎద్దడి తీరిందని, పూడిక మట్టిని ఎరువుగా వినియోగించడంవల్ల ఎరువుల వాడకం 50 నుంచి 35 శాతానికి తగ్గించగలిగామని, తద్వారా 27.60 శాతం ఖర్చు కూడా తగ్గిందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ చెరువుల నీటి నిలువ సామర్థ్యం పెంచడంలో విజయవంతమైంది. గొలుసు కట్టు చెరువులకు నిలయమైన తెలంగాణలో చెరువుల ఉనికే ప్రశ్నార్థకంగా మారి ప్రమాదం అంచున పడిన సమయంలో చెరువుల పునరుద్ధరణ నిర్ణయంతో సాగు విస్తీర్ణం పెరిగిందని చెబుతున్నారు. చెరువుల పునరుద్ధరణతో గ్రామాల్లో జలకళ సంతరించుకుంది. తెలంగాణను సస్యశ్యామల తెలంగాణగా, అన్నపూర్ణగా నిలిపేందుకు సీఎం కేసీఆర్‌ కృషికి తార్కారణంగా మిషన్‌ కాకతీయ నిలిచిందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. మిషన్‌ కాకతీయతో గ్రామాల్లోని చెరువులన్నీ నిండి నీటి ముల్లెలుగా తయారయ్యాయి. నీటి కొరతను అధిగమించడంలో ప్రజలకు చేరువయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement