Monday, May 20, 2024

వత్తుల తయారీ పేరిట కుచ్చుటోపీ.. 20 కోట్లతో ఏబీజీ సంస్థ పరారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ శివారులోని బోడుప్పల్‌లో మరో భారీ మోసం వెలుగు చూసింది. వత్తుల తయారీ పేరిట ఏబీజీ సంస్థ పెద్దఎత్తున డిపాజిట్లు వసూలు చేసి పలాయనం చిత్తగించింది. వత్తుల తయారీకి దూది తామే ఇస్తామని, వత్తులను తయారు చేసే యంత్రాలను సమకూరుస్తామని మాయ మాటలు చెప్పి స్థానిక ప్రజలను నిలువునా ముంచింది. వత్తులకు కిలో రూ.600 ఇస్తామని బాధితులకు ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో వ్యక్తి నుంచి రూ.లక్షా 70వేలను వసూలు చేసి ఏబీజీ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ కంపెనీ యజమాని బాలసాని గౌడ్‌పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 600 మంది బాధితుల నుంచి డిపాజిట్లు సేకరించినట్లు పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో బయటపడింది. రూ.20 కోట్ల మేర నిర్వాహకుడు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఏబీజీ సంస్థపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దూది మాదే.. తయారీ యంత్రం మాదే.. జస్ట్‌ వత్తులు తయారు చేసి ఇస్తే కిలో రూ.600 ఇస్తాం అంటూ యూట్యూబ్‌లో ప్రకటనలు హోరెత్తించారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన ఈ వీడియో చూసి గృహిణులు, ఉద్యోగినులు, చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్లు ఆకర్షితులయ్యారు. దూది ఇచ్చి యంత్రాలు ఇచ్చినపుడు వత్తులు తయారు చేయడం పెద్ద ఇబ్బంది కాదని భావించిన మహిళలు ఏబీజీ సంస్థ అడిగిన డిపాజిట్‌ను చెల్లించారు. కిలో వత్తులకు రూ.600 వస్తుంటే ఎందుకు కాదనాలని ఇంట్లోనే ఉంటూ ఇంటి పని ముగిశాక వత్తుల పని చేసుకోవచ్చని భావించిన గృహిణులు, మహిళలు ఆశ పడి భంగపడ్డారు. నిర్వాహకులు అడిగినంత డిపాజిట్‌ చెల్లించారు. రెండు నెలలపాటు సాఫీగా సాగిన ఈ వ్యాపారం ఆ తర్వాత కంపెనీ 600 మందికి కుచ్చుటోపీ పెట్టి బోర్డు తిప్పేసింది. రూ.20 కోట్ల వరకు డిపాజిట్లు తీసుకున్న ఏబీజే సంస్థ నిర్వాహకులు రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేశారు. ఇది ఒక్క బోడుప్పల్‌కే పరిమితం కాలేదు. నగరంలోని రాంనగర్‌, విద్యానగర్‌, కాచిగూడ, కూకట్‌పల్లి, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో ఉన్న మహిళలకు ఆశ చూపి వారి నుంచి వత్తుల తయారీ పేరుతో డిపాజిట్లు సేకరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కుచ్చుటోపీ పెట్టి బోర్డు తిప్పేసిన ఏబీజీ సంస్థ నిర్వాహకుడు బాలస్వామి గౌడ్‌ను పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement