Sunday, April 28, 2024

Big Story: ఆదానీ – అంబానీ ఢీ కొంటారా ?.. 5జీలో అదానీ ప్రవేశం

అపరకుబేరులైన వ్యాపార దిగ్గజాలు ముఖేష్‌ అంబానీ, గౌతమ్‌ అదానీలు నేరుగా పోటీ పడబోతున్నారా..? గుజరాత్‌కు చెందిన ఈ ఇద్దరు వేరు వేరు వ్యాపారాలు కలిగి ఉన్నారు. ఇద్దరూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితులు. ఇప్పటి వరకు ఏ వ్యాపారంలోనూ ఇద్దరు పోటీ పడలేదు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఏర్పడిందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
5జీ రంగంలోకి అదానీ జులై 26న జరిగే 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో తాము పాల్గొంటున్నట్లు అదానీ ఎంట్రర్‌ప్రైజెస్‌ ప్రకటించింది. వేలంలో తమకు కేటాయించే స్పెక్ట్రమ్‌ ను ప్రయివేట్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు మాత్రమే వినియోగిస్తామని ప్రకటించింది. వినియోగదారుల టెలికం సర్వీసుల్లోకి ప్రవేశించడంలేదని తెలిపింది. పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, మైనింగ్‌, డేటా సెంటర్ల ఏర్పాటు వంటి వాటి కోసమే స్పెక్ట్రమ్‌ ను ఉపయోగించనున్నట్లు తెలిపింది. టెలికం రంగంలో ముఖేష్‌ అంబానీకి చెందిన జియో సేవలు అందిస్తోంది. 5జీ వేలంలో ఈ కంపెనీ కూడా బిడ్‌ దాఖలు చేయనుంది. దీనితో పాటు ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ కూడా బిడ్డింగ్‌లో పాల్గొంటాయి. ఈ సంస్థలు 5జీ సేవలను వినియోగదారులకు అందించేందుకు ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేయనున్నాయి. అదానీ కంపెనీ ప్రయివేట్‌ క్యాప్టివ్‌ నెట్‌వర్క్‌ కోసం 5జీ స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేయనుంది.

ఇలా ప్రయివేట్‌ క్యాప్టివ్‌ నెట్‌వర్క్‌ కోసం బిడ్డింగ్‌లో పాల్గొంటున్న కంపెనీలు ముందు ముందు టెలికం సేవల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని టెలికం ఆపరేటర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. నాన్‌ టెలికం సంస్థలకు 5జీని కేటాయించవద్దని ఇప్పటికే ఈ సంస్థలు ప్రభుత్వాన్ని గట్టిగా కోరాయి. క్యాప్టివ్‌ నెట్‌వర్క్‌కు 5జీని కేటాయిస్తే తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఈ కంపెనీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ప్రయివేట్‌ టెలికం కంపెనీల అభ్యంతరాలను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే అదానీ కూడా 5జీ రేసులోకి వస్తుండటంతో అగ్రస్థానంలో ఉన్న జియోకి అదానీ ఆధ్వర్యంలోని కంపెనీ గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి తాము టెలికం రంగంలోకి రావడంలేదని ప్రకటించినప్పటికీ, ప్రభుత్వ పరంగా ఏమైనా నిబంధనలు ఉంటే తప్ప అదానీని టెలికం సేవల్లోకి రాకుండా అడ్డుకోవడం సాధ్యం కాదని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎనర్జీ బిజినెస్‌లోకి అంబానీ అదానీ చేస్తున్న ఎనర్జీ బిజినెస్‌లో వేల కోట్ల పెట్టుబడితో అంబానీ కూడా ప్రవేశిస్తున్నారు. హైడ్రోజన్‌, ప్యూయల్‌ సెల్స్‌, బ్యాటరీల తయారీ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు అంబానీ ప్రకటించారు. 2030 నాటికి హైడ్రోజన్‌ బిజినెస్‌లో దేశంలోనే అగ్రగామి సంస్థగా ఎదుగుతామని అదానీ అంతకు క్రితం ప్రకటించారు. ఈ రంగంలో ఈ దిగ్గజ పారిశ్రామికవేత్తలు పోటీ పడనున్నారు.

అదానీ గ్రూప్‌ కు చెందిన కంపెనీ సోలార్‌ పవర్‌తో గ్రీన్‌హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయనుంది. అంబానీ కంపెనీ మాత్రం పెట్రోలియం సహజ వాయువు నుంచి హైడ్రోజన్‌ గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది. ఒకే బిజినెస్‌లో ఉన్నప్పటికీ, వేరు వేరుగా హైడ్రోజన్‌ ఉత్పత్తి ప్రణాళికలు ఉన్నాయి. టెలికం రంగంలోనూ ఇద్దరు దిగ్గజ పారిశ్రామికవేత్తలు నేరుగా పోటీ పడే అవకాశం తక్కువని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెట్టకుంటే మాత్రం క్యాప్టిక్‌ నెట్‌వర్క్‌ కోసం తీసుకు 5జీ స్పెక్ట్రమ్‌ ను తమ పరిధిలోని కస్టమర్లకు టెలికం సేవలు అందించే పేరుతో సేవలు అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement