Monday, May 6, 2024

పంటలపై ఎగబడుతున్నయ్.. వేరుశనగపై అడవిపందుల దాడి

సుండుపల్లె, (కడప) ప్రభ న్యూస్‌ : పంటలు సాగు చేసినప్పటి నుంచి ఆ ధాన్యం వడుపుకునే వరకు ఆరుగాలం కష్టపడే అన్నదాతలకు రబీ పంటగా సాగు చేసిన వేరుశనగ పంటను అడవి జంతువుల నుంచి కాపాడుకోవడానికి రాత్రులు కష్టాలు ప్రారంభమయ్యాయి. వివరాలలోకి వెళ్లితే.. రైతులు రబీ పంట కాలం కింద ఎక్కువగా డిసెంబర్‌, జనవరి నెలల్లో వేరుశనగ పంట సాగు చేశారు. ప్రస్తుతం వేరుశనగ పంటలో కాయల దిగుబడి ప్రారంభం కావడంతో అడవి జంతువులైన అడవిపందులు గుంపులు గుంపులుగా వచ్చి పొలాల్లో దాడులు చేసి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఒక్కో రైతు ఎకరా పొలంలో వేరుశనగ సాగుకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేశారు. అయితే పంట చేతికొచ్చే సమయంలో అడవిపందులు పంటలబాట పట్టడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. దీంతో కొంతమేర ఆర్థికస్థోమత ఉన్న రైతులు కొందరు తమ పొలం చుట్టూ ఇనుపకంచెలు, ఇంకొందరు సోలార్‌ కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నారు. శేషాచలం అటవీ ప్రాంత పరిధిలోని చిన్నగొల్లపల్లె, మాచిరెడ్డిగారిపల్లె, రాయవరం, ముడుంపాడు పంచాయతీల పరిధిలో ఉన్న వేరుశనగ పంటలను అడవిపందులు ధ్వంసం చేస్తున్నాయి. వీటి నుంచి రక్షణ కోసం రైతులు కంచెలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పొలం చుట్టూ తమ ఇళ్లలోని మహిళల చీరలు కడుతున్నారు. శబ్దాలు చేయడానికి చిన్న చిన్న బ్యాటరీ స్పీకర్లు, ప్లాస్టిక్‌ సంచులను కట్టెలకు తగిలించి బెదుర్లు పెడుతున్నారు. వీటన్నింటికీ కూడా అడవి పందులు బెదరకపోవడంతో పొలంలో వేసుకున్న గుడిసెలలో రైతులు ప్రతి రోజూ రాత్రులలో పొలం వద్దే జాగారణ చేస్తూ కాపలాగా ఉండాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సోలార్‌ కంచెతో రక్షణ: తన పొలంలో సాగు చేసిన వేరుశనగ పంట కాపాడుకోవడానికి పొలం చుట్టూ ఇనుపకంచెతో పాటు రూ.15 వేలు ఖర్చు చేసి సోలార్‌ కంచె ఏర్పాటు చేసుకున్నట్లు చిన్నగొల్లపల్లె రైతు వెంకటయ్య తెలిపారు. కంచెలు ఉన్నా అడవి నుంచి పందులు వస్తున్నందున రాత్రిపూట కాపలా తప్పలేదని రైతు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement