Monday, May 6, 2024

ప్చ్‌… పనితీరు ఏం బాలేదు.. బీజేపీ అధికార ప్రతినిధులపై బండి ఫైర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన అనంతరం టీఆర్‌ఎస్‌ నేతలు వరుసగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ప్రధాని చేసిందేమీ లేదని, ఇచ్చిన నిధులేమీ లేవంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టడంలో అధికార ప్రతినిధులు ఘోరంగా విఫలమయ్యారని సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం అధికార ప్రతినిధులతో సంజయ్‌ భేటీ అయి చర్చించారు.
పార్టీకి చెందిన తొమ్మిది మంది రాష్ట్ర అధికార ప్రతినిధులు హాజరైన సమావేశంలో మాట్లాడిన సంజయ్‌ అధికార టీఆర్‌ఎస్‌ వైఖరిని అడుగడుగునా ఎండగట్టాల్సిన బాధ్యత ఉన్న మీరంతా ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రధాన మంత్రిపై టీఆర్‌ఎస్‌ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడారని, అవాకులు, చేవాకులు పేలారని, వీటన్నింటిపై కౌంటర్‌ ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉందన్న విషయాన్ని ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. పార్టీ పనితీరుతో పాటు అధికార పార్టీ వైఫల్యాలను, రాష్ట్ర ప్రభుత్వ పాలనలోని లోపాలను ప్రజల ముందుంచడంలో విఫలమవుతున్నామని అభిప్రాయపడ్డారు. ప్రజా క్షేత్రంలో టీఆర్‌ఎస్‌ను దోషిగా నిలబెట్టాలన్నారు.

ప్రతి రోజూ కనీసం ఒక అధికార ప్రతినిది రాష్ట్ర కార్యాలయంలో మీడియాకు అందుబాటులో ఉండాలని, మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని సంజయ్‌ సూచించారు. అబద్దాల పునాదులపైనే టీఆర్‌ఎస్‌ ఉందని, ఆ పునాదులను కూకటివేళ్ళతో కూల్చి వేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని విస్మరించొద్దన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులను పథకాల వారిగా ప్రజల ముందుంచాలని, కేటాయిస్తున్న నిధుల వినియోగంపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలన్నారు. ప్రజల్లో బీజేపీ అంటే నమ్మకం, విశ్వాసం ఏర్పడిందని, అందుకు అనుగుణంగా మనం నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement