Monday, April 29, 2024

డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్‌కు క్లీన్‌ చిట్‌.. సాక్ష్యాధారాలు లేవ‌న్న సిట్‌

బాలీవుడ్‌ బాదుషా… షారూఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు డ్రగ్స్‌ కేసులో ఊరట లభించింది. నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరోయే (ఎన్‌సీబీ) ఆయనకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఈ మేరకు చార్జిషీట్‌లో పేర్కొంది. ఆర్యన్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని ఎన్‌సీబీ సీనియర్‌ అధికారి ఒకరు తెలియజేశారు. ఈ కేసులో ఆర్యన్‌ ఖాన్‌తో పాటు 19 మందిని ఎన్‌సీబీ నిరుడు అక్టోబర్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు మినహా అందరూ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. ఆర్యన్‌, మెహక్‌ మినహా మిగతా అందరి వద్ద డ్రగ్స్‌ ఉన్నట్లు తొలుత అధికారులు గుర్తించారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించారు.దీనిపై దర్యప్తు జరిపిన సిట్‌ ఆర్యన్‌ ఖాన్‌తో సహా ఆరుగురిపై తగిన సాక్ష్యాధారాలు లభించలేదని తేల్చి చెప్పింది. మిగిలిన 14 మందిపై మాత్రం కేసు నమోదు చేసింది. ఈ 14 మందిపై ఎన్‌సీబీ నేడు కోర్టుకు ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌ దాదాపు ఆరు వేల పేజీలుంది. ఇందులో ఈ 14 మంది అభియోగాలు, అందుకు దొరికిన సాక్ష్యాధారాలను నమోదు చేసింది. ఆర్యన్‌ ఖాన్‌తో పాటు ఆరుగురి వద్ద డ్రగ్స్‌ ఉన్నట్లు ఆధారాలు లభించలేదని ఎన్‌సీబీ వివరించింది. ఆర్యన్‌కు క్లీన్‌చిట్‌ లభించడం ఆయన తండ్రి షారూఖ్‌ ఖాన్‌కు గొప్ప ఊరట అని ప్రముఖ సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గిd అభిప్రాయపడ్డారు. నిజం ఇప్పటికైనా బయటపడింది. ఆర్యన్‌ వద్ద ఎలాంటి మాదకద్రవ్యాలు లభించలేదు. అతడిపై కేసు నమోదు చేసేందుకు ఎలాంటి ఆధారాల్లేవు. ఇప్పటికైనా ఎన్‌సీబీ తన తప్పు తెలుసుకుంది. సంతోషం… అని రోహత్గిd వ్యాఖ్యానించారు. ముంబై తీరంలోని ఓ క్రూజ్‌ నౌకలో మాదక ద్రవ్యాలు లభించడం, అందులో ఆర్యన్‌ ఖాన్‌ కూడా ఉండడంతో నిరుడు ఈ కేసు పెను సంచలనం సృష్టించింది. గత అక్టోబర్‌ 3వ తేదీన ఎన్‌సీబీ ఆర్యన్‌ ఖాన్‌ను అరెస్టు చేసింది. అతనిని జ్యుడీషియల్‌ కస్టడీకి విధిస్తూ అక్బోర్‌ 7న ముంబై ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆయనను ఆర్థర్‌ రోడ్‌ జైలుకు తరలించారు. ఆ తరువాత ఆర్యన్‌ బెయిల్‌ కోసం పెట్టుకున్న దరఖాస్తును ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో ఆర్యన్‌ తరుపు న్యాయవాదులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆర్యన్‌ తరుపున ముకుల్‌ రోహత్గిd వాదించారు. సుదీర్ఘ విచారణ అనంతరం అక్టోబర్‌ 29న బెయిల్‌ ఇచ్చింది. అక్టోబర్‌ 30న ఆర్యన్‌ బెయిల్‌పై విడుదలయ్యారు.

సమీర్‌ వాంఖడేపై చర్యలకు ఆదేశం.

ఆర్యన్‌ ఖాన్‌పై నమోదైన డ్రగ్స్‌ కేసును తొలినాళ్లలో అప్పటి ఎన్‌సీబీ ముంబై జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే దర్యాప్తు చేశారు. ఈ కేసును నీరుగార్చడానికి ప్రయత్నించడం, తప్పుడు కుల ధ్రువీకరణపత్రాలు సమర్పించినందుకు సమీర్‌పై చర్యలు చేపట్టాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలుస్తున్నది. కేసు దర్యాప్తు జరుపుతున్న సమయంలో వాంఖడే అనేక ఆరోపణలు వచ్చాయి. డబ్బులు గుంజేందుకే ఆర్యన్‌ను కుట్రపూరితంగా ఈ కేసులలో ఇరికించారంటూ ఎన్‌సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ ఆరోపించారు. అంతేగాక, వాంఖడే ముస్లిం అని, ఉద్యోగం కోసం ఎస్సీగా తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారంటూ ఆరోపణలు చేశారు. దీంతో వాంఖడే రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఈ క్రమంలోనే వాంఖడేను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెల్‌జెన్స్‌కు బదిలీ చేశారు. అనంతరం డ్రగ్స్‌ కేసు దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేశారు. ఆర్యన్‌ ఖాన్‌ మరో ఐదుగురు నిర్దోషులను ఇప్పుడు సిట్‌ తేల్చింది. మరి ఇప్పుడు సమీర్‌ వాంఖడేపైనా, ఆయన బృందంపైనా చర్యలు చేపడతారా లేక ద్రోహులకు రక్షణ కల్పిస్తారా అని నవాబ్‌ మాలిక్‌ ఈ రోజు ట్వీట్‌ చేశారు. ఈ కేసు దర్యాప్తులో వాంఖడే బృందం ఐదు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించామని అధికారులు తెలియజేశారు. ఈ కేసులో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టినప్పుడు ఎలాంటి వీడియోగ్రఫీ చేయలేదని తెలుస్తున్నది. అంతేగాక, ఒక సాక్షి నుంచి ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తున్నది. అదేవిధంగా.. ఆర్యన్‌ ఖాన్‌ ఫోన్‌లోని వివరాలను విశ్లేషించడంలో కూడా లోపాలు చోటుచేసుకున్నాయి. పైగా డ్రగ్స్‌ వినియోగించారో లేదో నిర్ధారించడానికి కనీసం వైద్య పరీక్షలు కూడా చేయించలేదని కూడా తేలింది. ఈ ఘటనలో డ్రగ్స్‌ తీసుకున్న వారిని, తీసుకోని వారిని ఒకే గాటన కట్టి అందిరిపై ఒకే తీరుగా నేరారోపణలు చేశారని తేలింది. దాడి జరిగిన సమయంలో ఆర్యన్‌ ఖాన్‌ వద్ద డ్రగ్స్‌ దొరకనే లేదని కూడా నిర్ధారణ అయింది. ఆర్యన్‌ ఖాన్‌ మిత్రుడు అర్బాజ్‌ మర్చంట్‌ ఇచ్చిన వాంగ్మూలాన్ని వాంఖడే బృందం ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టిందన్న వాస్తవాన్ని కూడా గుర్తించారు. తన కోసం ఆరు గ్రాముల చరస్‌ను వెంట తీసుకెళ్లాలని, అది ఆర్యన్‌కోసం కానేకాదని అర్బాజ్‌ చెప్పినట్లు తెలిసింది. మాదకద్రవ్యాలను క్రూజ్‌ లోకి తీసుకురావద్దని ఆర్యన్‌ తనకు సలహాకూడా ఇచ్చినట్లు అర్బాజ్‌ నార్కోటిక్‌ బృందానికి వివరించాడు. అయినప్పటికీ… ఆర్యన్‌ ఖాన్‌ను వాంఖడే అరెస్టు చేశారు. పైగా అర్బాజ్‌ తెచ్చిన చరస్‌ ఆర్యన్‌ కోసమేనని నేరారోపణ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement