Tuesday, May 14, 2024

ఏడున్నరేళ్లు ఓపికపట్టాం.. ఇక ఆగేది లేదు.. దేనికైనా రెడీ..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: ఢిల్లిపై యుద్దాన్ని ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అందుకు తగ్గ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఢిల్లిలో రైతుదీక్ష లేదా ధర్నా చేపట్టాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై ముప్పేట దాడికి ప్రణాళిక చేస్తున్న గులాబీ పార్టీ.. వాటిపై మంగళవారం నిర్వహించనున్న శాసనసభాపక్షం సమావేశంలో చర్చించనుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరగనుంది. కేంద్ర వైఖరి, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, బీజేపీ అనుసరిస్తున్న వైఖరితో పాటు విపక్షాల ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలనే విషయాలపైనా కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

ఢిల్లి స్థాయి ఆందోళనతో పాటు రాష్ట్రంలో ఏ రూపంలో కొనసాగించాలో వ్యూహాలను ఖరారు చేయనున్నారు. ఢిల్లి ధర్నాలో తాను స్వయంగా పాల్గొంటానని ఇదివరకే స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గల్లి టు ఢిల్లి కేంద్రంపై యుద్ధానికి క్యాడర్‌ను కార్యోన్ముఖులను చేయనున్నారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ వైఖరిపై శాసనసభాపక్ష సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక తీరు, రాష్ట్ర బీజేపీ మరో తీరుగా వ్యవహరిస్తూ రైతులను అయోమయానికి గురి చేస్తోందని టీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది.

ఈనెల 12న నియోజకవర్గాల వారీగా ధర్నాలు కూడా నిర్వహించింది. కేంద్రం స్పష్టతనిచ్చే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని, ఢిల్లిలో నిర్వహించే ధర్నా తేదీని ఖరారుచేయడంతో పాటు గల్లి టు ఢిల్లి దుమ్మురేపేలా, కేంద్రానికి షాకిచ్చేలా ఆందోళనలు కొనసాగించాలని టీఆర్‌ఎస్‌ యోచిస్తోంది. సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటనను అడుగడుగునా అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు గల్లిలో యుద్ధానికి కాలు దువ్వగా, ఢిల్లిలోనూ ధర్నా చేసి.. కేంద్రం తీరును ఎండగట్టాలని, యాసంగి ధాన్యం కొనుగోలుపై స్పష్టత సాధించాలని, విభజన హామీలు రాబట్టాలని డిసైడైంది. ఏడున్నరేళ్ళు ఓపికపట్టాం.. ఇక ఓపికపట్టేది లేదని హెచ్చరిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పై, కేంద్రంపై స్వయంగా తానే విరుచుకుపడి.. నేతలకు దిశానిర్దేశం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement