Sunday, May 5, 2024

Warning – కల్లోలం సృస్టిస్తాం… అయోధ్య‌కు బెదిరింపులు…ముగ్గురి అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న వేళ ఉగ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తామని ఇప్పటికే ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హెచ్చరించాడు. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద ముఠా జైషే మహ్మద్‌ కూడా అయోధ్యలో కల్లోలం సృష్టిస్తామని బెదిరింపులకు పాల్పడింది.

అయోధ్య‌లో హై అల‌ర్ట్‌..
బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలను ప్రస్తావిస్తూ కల్లోల పరిస్థితులు తప్పవని హెచ్చరించింది. దాంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అయోధ్యలో హైఅలర్ట్‌ ప్రకటించాయి. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిఘా వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది జనవరి 26 సందర్భంగా కూడా జైషే ఇలాంటి బెదిరింపులకు పాల్పడింది.

ముగ్గురు ఖ‌లిస్థానీ సానుభూతిప‌రుల అరెస్టు..
రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్యలో భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ ఇటీవల ముగ్గురు ఖలిస్థానీ సానుభూతిపరులను అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలోనే పన్నూ శుక్రవారం హెచ్చరికలు పంపాడు. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తామని, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తామని బెదిరించాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement