Sunday, April 28, 2024

విరాట‌ప‌ర్వం రివ్యూ ..

ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల తెర‌కెక్కించిన చిత్రం విరాట‌ప‌ర్వం నేడు ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ చిత్రం హిట్టా ఫ‌ట్టా చూద్దాం..

క‌థ ఏంటంటే.. న‌క్సలిజానికి ప్రేమ కథను జోడించి.. తన శైలిలో ఈ కథను ఎంతో స్వచ్చంగా, నిజాయితీగా చెప్పేందుకు ప్రయత్నించారు ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల‌. విరాటపర్వం కథ 1990వ ప్రాంతంలో జరుగుతుంది. వెన్నెల (సాయి పల్లవి) కామ్రెడ్ అరణ్య అలియాస్ రవన్న (రానా) రచనలకు ప్రభావితం అవుతుంది. ప్రేమను పెంచుకుంటుంది. అయితే దళనాయకుడైన రవన్నను పట్టుకునేందుకు పోలీసులు కూడా తీవ్రంగా గాలిస్తుంటారు. అలాంటి సమయంలోనే వెన్నెల కూడా ఇళ్లు వదిలి రవన్న కోసం ఊరురా తిరుగుతుంది. రవన్న చేరుకునేందుకు పడరాని కష్టాలు పడుతుంది. చివరకు దళంలో చేరుతుంది. అయితే ఆ సమయంలోనే దళంలో కోవర్టులున్నారని తెలుస్తుంది. చివరకు వెన్నెల మీద అనుమానం వస్తుంది. వెన్నెలను దళసభ్యులే అంతం చేస్తారు. అదే విరాటపర్వం కథ.. విషాద గాథ.

న‌టీ న‌టులు..విరాటపర్వం కథలో ఎంతో మంది నటీనటులున్నారు. భారతక్క (ప్రియమణి), రఘన్న (నవీన్ చంద్ర), శకుంతల (నందితా దాస్) ఇలా ఎన్నెన్నో పాత్రలున్నాయి. కానీ అందరి దృష్టి మాత్రం వెన్నెలగా నటించిన సాయి పల్లవి మీదే పడుతుంది. ఆ తరువాత రవన్నగా రానా పాత్రపై అందరికీ ఆసక్తి పెరుగుతుంది. వెన్నెల పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించేసింది. కొన్ని సీన్లలో కన్నీరు పెట్టించేస్తుంది. ఇక యాక్షన్ సీక్వెన్స్ చేసిన సమయంలో విజిల్స్ వేయిస్తుంది. అలా సాయి పల్లవి పూర్తిగా స్క్రీన్‌ను ఆక్రమించేసుకున్నట్టు అనిపిస్తుంది. రానా సైతం తన ఆహార్యంతోనే అందరినీ మెప్పిస్తాడు. రవన్న కారెక్టర్‌లో దళనాయకుడిగా ఆకట్టుకుంటాడు. రానా నటన, గంభీర్యమైన వాక్చతుర్యం పాత్రను మరింతగా ఎలివేట్ చేసింది. మిగతా పాత్రధారులైన ఈశ్వరీరావు, సాయి చంద్, రాహుల్ రామకృష్ణ, బెనర్జీ, నివేదా పేతురాజ్ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో అవలీలగా నటించేశారు.

విరాట పర్వం యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారనే విషయం తెలిశాక.. వెన్నెల పాత్ర ఎవరో కాదు తూము సరళే అని తెలిశాక.. నాడు జరిగిన ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. నాటి సరళ విషాద ఘట్టానికి సంబంధించిన వార్తలు మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే నక్సలైట్లే సరళను చంపేశారని అందరికీ తెలిసిందే. విరాట పర్వం కథను దర్శకుడు ఏ కోణంలో చూపిస్తాడు.. ఆ హత్యను ఎలా సమర్థిస్తాడు.. ఏవిధంగా చూపిస్తాడు..ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు.. అని నిర్ణయిస్తాడు అనే దాని మీద అందరికీ ఆసక్తి పెరిగింది.

అయితే దర్శకుడు వేణు మాత్రం ఇక్కడ ఆ సున్నితమైన అంశాన్ని ఎంతో హృద్యంగా, గుండె బరువెక్కేలా చిత్రీకరించాడు. సరైన జస్టిఫికేషన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఓ అందమైన ప్రేమ కథను అల్లేశాడు. ఈ సినిమా విషయంలో ఎంతో లిబర్టీ తీసుకున్నట్టు కనిపిస్తుంది. దళసభ్యులే అనుమానంతో కోవర్టు అని చంపినా దానికి దారి తీసిన కారణాలు, అనుమానం రావడానికి గల సంఘటనలను అద్భుతంగా పేర్చాడు. చివరకు పోలీసులు పన్నిన వలలో భాగంగానే దళ సభ్యులు అలా చేయాల్సి వచ్చిందని చెప్పకనే చెప్పేశాడు. తప్పు ఎవరిది? ఒప్పు ఎవరిది.. ఈ పాపం ఎవరిది అంటూ ఇక చివర్లో వేసిన విషాద గీతంతో తాను చెప్పదల్చుకున్నది చెప్పేశాడు. ప్రేక్షకుల తీర్పుకు వదిలేసినట్టుగా అనిపిస్తుంది.

- Advertisement -

ద్వితీయార్థంలో ప్రేమకు, విప్లవానికి సంఘర్షణ ఆకట్టుకుంటుంది. ప్రేమతో వెన్నెల విప్లవంలోకి అడుగుపెడుతుంది. అక్కడి నుంచి కథ ఆసక్తికరంగా మారుతుంది. ఇక చివర్లో క్లైమాక్స్ మాత్రం అందరి హృదయాలను తడుముతుంది. దర్శకుడే రచయిత కావడంతో కథను అనుగుణంగా రాసిన మాటలు ఎన్నో గుండెలను తాకుతుంటాయి. ప్రేమ అనేది రుగ్మతా? అనే విషయంలో జరిగే సంభాషణ, చర్చ మెప్పిస్తుంది.విరాటపర్వం సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా కనిపిస్తుంది. సురేష్ బొబ్బిలి పాటలు, ఆ జానపద గేయాలు, నేపథ్య సంగీతం అన్నీ కూడా మనసును తాకేలా ఉన్నాయి. రానా పాత్రకు సురేష్ బొబ్బిలి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఇక కెమెరాపనితనం అబ్బురపరుస్తుంది. సహజమైన లొకేషన్లలో తెరకెక్కించడం, అంతే సహజంగా చిత్రీకరించడంతో ఆ ఫీల్ తెరమీద కనిపిస్తుంది. ఎడిటింగ్, సినిమా నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
మొత్తానికి దర్శకుడు తాను చెప్పినట్టుగానే.. ఓ నిజాయితీ గల కథను.. అంతే నిజాయితీగా తెరకెక్కించాడు. స్వచ్చమైన ప్రేమ కథను.. అంతే స్వచ్చంగా తెరకెక్కించాడు. మ‌రి ఈ సినిమా జ‌యాప‌జ‌యాలు ప్రేక్ష‌కుల చేతిలో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement