Tuesday, May 7, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ‌కు 20న విజ‌యసాయిరెడ్డి పాద‌యాత్ర‌..

విశాఖ: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో ప్రభుత్వ విధానం చాలా స్పష్టంగా ఉందని, ప్లాంట్‌ పరిరక్షణకు ఎంతటి పోరాటానికైనా వైయస్‌ఆర్‌ సీపీ సిద్ధంగా ఉందని పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. అందులో భాగంగానే ఈనెల 20వ తేదీన విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరాట యాత్ర’ పేరుతో అన్ని నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నామన్నారు. 20న ఉదయం 8:30 గంటలకు జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం దగ్గర నుంచి.. అన్ని నియోజకవర్గాలు కవర్‌ చేస్తూ.. స్టీల్‌ ప్లాంట్‌ ప్రయోజనాలను కాపాడేందుకు పాదయాత్ర చేయనున్నట్లు వివరించారు. స్టీల్‌ప్లాంట్‌ ఎదురుగా ఆందోళన కార్యక్రమం చేపట్టి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని ఢిల్లీకి వినపడేలా చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని పార్లమెంట్‌లో, బయట వ్యతిరేకించామని చెప్పారు. విశాఖపట్నంలో ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు 56 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసినప్పుడు స్వర్గీయ వైయస్‌ఆర్‌ ఎలా వ్యతిరేకించారో.. అదేవిధంగా ఈ రోజు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. సీఎం వైయస్‌ జగన్‌ ప్రత్యామ్నాయాలను సూచించారు. స్టీల్‌ ప్లాంట్‌ను లాభాల్లోకి తీసుకురావాలంటే.. సొంత గనులను కేటాయించాలని, గనులను కేటాయిస్తే ఒక్కో టన్నుపైన సుమారు రూ.6 నుంచి రూ.7 వేలు ఆదా చేసినట్లు అవుతుంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విస్తరణలో 3 మిలియన్‌ టన్నుల కెపాసిటీ నుంచి 7.3 మిలియన్‌ టన్నుల కెపాసిటీకి పెంచినప్పుడు విపరీతమైన రుణభారం పడింది. దానిపైన దాదాపుగా 14 శాతం వడ్డీ కట్టడం జరుగుతుంది. దీని వల్ల ఎక్కువగా నష్టాలు వస్తున్నాయి. ఆ రుణాలను ఈక్విటీ కింద మార్పు చేయాలని కోరారు. ఈ రెండు చేస్తే ఆరు నెలల్లో స్టీల్‌ ప్లాంట్‌ లాభాల్లోకి వస్తుందని వైయస్‌ఆర్‌ సీపీ బలంగా నమ్ముతుంది. సీఎం కూడా స్పష్టంగా చెప్పారు.
సీఎం వైయస్‌ జగన్‌ చేసిన సూచనలను కేంద్ర ప్రభుత్వం ఈరోజుకూ అంగీకరించలేదు. 13 కార్మిక సంఘాల అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యాం. కార్మిక నాయకులతో చర్చలు జరుపుతూనే, వారి ఆందోళనకు సంఘీభావం తెలుపుతున్నాం. స్టీల్‌ ప్లాంట్‌ ఎదురుగా వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు అంతా కార్మికులకు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తాం. అఖిలపక్ష సమావేశంలో కార్మిక సంఘాలు కొన్ని డిమాండ్లను తీసుకువచ్చారు. సీఎం వైయస్‌ జగన్‌ను కలవడం, అతి త్వరలో కార్మిక సంఘాలతో కలుస్తాం. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని కోరారు. కార్మిక సంఘాల నేతలపై సీఎం స్పందిస్తారు. ఇతర డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తాం. ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ కోరడం జరిగింది. కార్మికులకు అపాయింట్‌ ఇస్తారో లేదో కానీ, కార్మిక సంఘాలకు అనుబంధంగా ఉన్న రాజకీయ పార్టీలు సీపీఎం, సీపీఐ, ఇతర పార్టీల పార్లమెంట్‌ సభ్యులతో ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరడం జరుగుతుంది. ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇస్తారని భావిస్తున్నాం అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement