Monday, May 6, 2024

కానరాని మామిడి ! భారీగా తగ్గిన దిగుబడి

వికారాబాద్‌, ప్రభన్యూస్‌ : వివిధ ప్రాంతాల నుంచి పలు రకాల మామిడి పండ్లు హైదరాబాద్‌ మార్కెట్‌కు వస్తాయి. అక్కడి నుంచి వ్యాపారులు వాటిని కొనుగోలు చేసి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తారు. వ్యాపారులు ఎక్కువగా మామిడి కాయలను కొనుగోలు చేసి ఆయా ప్రాంతాలలో ఉన్న బట్టీలలో మాగేసి పండ్లుగా మారుస్తారు. జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి ప్రాంతాలకు ప్రతిరోజు వంద వరకు చిన్న వాహనాలలో మామిడి పండ్లు హైదరాబాద్‌ మార్కెట్‌ నుంచి వస్తుంటాయి. ఎక్కువ రోజుల పాటు మామిడి పండ్లను నిల్వ చేసేందుకు ఆయా ప్రాంతాలలో శీతల గిడ్డంగులను సైతం వ్యాపారులు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుత సీజన్‌లో హైదరాబాద్‌ మార్కెట్‌కు మామిడి రాక చాలా తక్కువగా ఉన్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్‌ మార్కెట్‌లో మామిడి పండ్లు లేకపోవడంతో దాని ప్రభావం జిల్లాపై పడింది. ప్రతిఏటా వేసవిలో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో రసం మామిడి పండ్లతో పాటు కోత మామిడి పండ్లకు ఎక్కువగా డిమాండ్‌ ఉంటుంది. దసేరి, బేనిషాన్‌, తోతాపరి లాంటి రకాలకు ప్రజల నుంచి డిమాండ్‌ ఉంటుంది. వీటితో పాటు పెద్ద రసాలు, కేసర్‌, హిమాయత్‌ లాంటి రసం మామిడి పండ్లకు సైతం డిమాండ్‌ ఉంటుంది. ఈసారి అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. వేసవి వచ్చింది అంటే చాలు మామిడి పండ్ల కొరకు మెజార్టీ ప్రజలు ఆరగించేందుకు ఆసక్తి చూపిస్తారు.. మార్కెట్‌లో ఎక్కడా మామిడి పండ్లు కనిపించడం లేదు. దిగుబడి లేకపోవడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. స్థానికంగా పండించిన మామిడి పండ్లను రైతులు సమీప పట్టణాలకు తీసుకవచ్చి విక్రయించడం జరిగేది. ప్రస్తుత వేసవిలో మామిడి దిగుబడి లేకపోవడంతో రైతులు.. గ్రామీణ ప్రజలు ఎవరు కూడా మామిడి పండ్లను పట్టణ ప్రాంతాల్లో విక్రయించడం లేదు.

గత శీతాకాలంలో చలి పెద్దగా లేకపోవడంతో మామిడి చెట్లకు పూత రాలేదు. ఈ కారణంగా దిగుబడి భారీగా తగ్గిందని రైతులు పేర్కొంటున్నారు. ఇటీవల కొద్ది రోజులుగా జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలలో గాలి దుమారం అధికంగా ఉండడంతో మామిడి కాయలు రాలిపోయాయి. తరచుగా గాలి బీభత్సం కారణంగా మామిడి దిగుబడి మరింత తగ్గినట్లు రైతులు వాపోతున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో మామిడి దిగుబడి తగ్గిపోవడంతో మార్కెట్‌లో మామిడి పండ్ల సందడి కనిపించడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. వేసవిలో మార్చి నుంచి మొదలై మే మాసం మధ్య వరకు మామిడి మార్కెట్‌లను ముంచెత్తుతాయి. ప్రస్తుతం మాత్రం మార్కెట్‌లో అరకొరగా మాత్రమే మామిడి పండ్లు కనిపిస్తున్నాయి. ఒకటి రెండు రకాలు తప్ప పెద్దగా మామిడి రకాలు కానరావడం లేదు. మార్కెట్‌లో మామిడికి డిమాండ్‌ ఏర్పడింది. ప్రస్తుతం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కోత రకం మామిడి పండ్లు కిలో రూ.100 వరకు పలుకుతున్నాయి. పసందైన మామిడి పండ్లు మార్కెట్‌లో లేకపోవడంతో మామిడి ప్రియులు కొంత నిరాశకు లోనవుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement