Sunday, April 28, 2024

ఐరాస ఒప్పందాలపై ఉక్రెయిన్‌, రష్యా సంతకాలు.. నల్ల సముద్రం మీదుగా ధాన్యం రవాణా

రష్యా- ఉక్రెయిన్‌ యుద్దం కారణంగా తలెత్తిన ప్రపంచ ఆహార కొరతను తీర్చే దిశగా పావులు కదులుతున్నాయి. ఉక్రెయిన్‌పై సైనిక చర్యగా చెప్పుకుంటున్న రష్యా యుద్దం తలపెట్టి 150 రోజులు పూర్తయిన సందర్బంగా ఇరుదేశాలు రాజీ అయ్యే అవకాశముందని నిపుణులు అంటారు. అయితే రష్యా ఒప్పందాన్ని నీరుగార్చిందని తెలుస్తోంది. నల్ల సముద్రం మీదుగా నౌకల ద్వారా ఆహార ధాన్యాల రవాణా కొనసాగించేందుకు ఐక్యరాజ్య సమితి, తుర్కియెలతో రష్యా, ఉక్రెయిన్‌లు వేర్వేరుగా ఒప్పందాలు చేసుకున్నాయి. ఉక్రెయిన్‌ నౌకాశ్రయాలను రష్యా సైన్యం దిగ్బందించింది. దీంతో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తాజా ఒప్పందం ద్వారా రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి లక్షలాది టన్నుల ధాన్యంతో పాటు, రష్యా నుంచి ఎరువుల రవాణాకు మార్గం ఏర్పడింది. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, ఉక్రెయిన్‌ మౌలిక వనరుల మంత్రి ఒలెగ్జాండర్‌ కుబ్రకోవ్‌లు ఐరాస ప్రదానకార్యదర్శి ఆంటోనియో గుటెరన్‌, తుర్కియె రక్షణ మంత్రి హులుసి ఆకార్‌లతో వేర్వేరు ఒప్పందాలపై సంతకాలు చేశారు. దీని ప్రకారం నల్ల సముద్రం మీదుగా సరుకు నౌకల రవాణా సవ్యంగా సాగేలా తుర్కియె చూసుకుంటుంది. ఈ నౌకల ద్వారా ఆయుధాల రవాణా జరగకుండా తుర్కియె తనిఖీలు చేస్తుంటుంది. ప్రపంచంలోనే అత్యధికంగా గోధుమలు, మొక్క జొన్నలు, పొద్దు తిరుగుడు నూనె ఎగుమతి చేసే దేశాల్లో ఉక్రెయిన్‌ ఒకటి. ఐదు నెలలుగా సాగుతున్న యుద్దం కారణంగా ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఒప్పందంపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది.

ఒప్పందపత్రానికి రష్యా తూట్లు
ఉక్రెయిన్‌లోని మూడు పోర్టుల నుంచి ధాన్యం ఎగుమతి చేసుకునేందుకు రష్యా అంగీకరించింది.ఈ మేరకు ఒప్పందం కూడా జరిగింది. అయితే ఆ మరుసటి రోజే ఒడెస్సా పోర్టుపై మిస్సైల్స్‌ దాడి చేశాయి. ఈ దాడిని ఐక్యరాజ్య సమితి, అమెరికా, ఉక్రెయిన్‌ తీవ్రంగా ఖండించాయి. రష్యా మాటలపై నమ్మకం ఉంచడమే తప్పంటూ దుయ్యబట్టాయి. ఈ క్రమంలో తాము ఎలాంటి దాడి చెయ్యలేదని రష్యా అధికారులు చెప్పినట్లు టర్కీ తెలిపింది.

ఉక్రెయిన్‌కు సువర్ణావకాశం
రష్యాను చావు దెబ్బ కొట్టడానికి ఉక్రెయిన్‌కు సువర్ణావకాశం రాబోతుందని బ్రిటన్‌ స్పై చీఫ్‌ రిచర్డ్‌ మూరే జోస్యం చెప్పారు. ఇంతవరకు విర్రవీగిన రష్యాకు బలగాల కొరత ఏర్పడిందని, కొద్ది రోజుల్లో వారికి మెటీరియల్‌ సరఫరా చేయడానికి కూడా ఎవరూ అందుబాటులో ఉండే పరిస్థితి లేదని చెప్పారు.

ఇలాంటి క్లిష్ట సమయంలో రష్యా సేనలు యుద్దాన్ని కొద్ది రోజులపాటు ఆపాల్సి వస్తుందని మూరే పేర్కొన్నారు. ఆ అవకాశాన్ని కీవ్‌ సద్వినియోగం చేసుకుని రష్యాను కోలుకోలేని దెబ్బ కొట్టవచ్చని అభిప్రాయపడ్డారు. కొలరడోలో అస్పెన్‌ సెక్యూరిటీ ఫోరంలో మాట్లాడుతూ మూరే ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్దంలో రష్యా 15,000 బలగాలను కోల్పోయిందని మూరే చెప్పారు. ఇది తమ అంచనా మాత్రమేనని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలు పెట్టి ఐదునెలలు కావొస్తోంది. రష్యా సేనలను నిలువరించేందుకు కీవ్‌కు అమెరికా సహా అగ్రదేశాలు భారీ ఆయుధ, ఆర్థిక సాయం అందించాయి. దీంతో అమెరికా హిమార్స్‌ దీర్ఘ శ్రేణి క్షిపణులను ఉక్రెయిన్‌ సేవలు ఇటీవలె మొహరించాయి. అదను చూసి వాటిని ఉపయోగిస్తే యుద్దంలో విజయం సాధించవచ్చని కీవ్‌ ప్రపంచానికి నిరూపించవచ్చని మూరే అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌ సేనలు మరింత తెగువను చూపితే రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని తిరిగి పొందవచ్చన్నారు. అయితే ఈ ప్రకటనలను తుంగలో తొక్కుతూ రష్యా విదేశాంగ శాఖా ప్రతినిధి మరియా జఖరోవా మాట్లాడుతూ .. ఒడెస్సా పోర్టులోని మిలటరీ ఇన్‌ఫ్రాస్టక్చర్‌పైన ఈ దాడి జరిగినట్లు ప్రకటించారు. దీంతో మరోసారి పశ్చిమ దేశాలు రష్యాపై అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఈ దాడిలో పోర్టులోని కొంత భాగం నాశనమైందని, కొంతమందికి గాయాలయ్యాయని ఒడెస్సా ప్రాంత గవర్నర్‌ మక్సీమ్‌ మర్చెంకో ప్రకటించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement