Friday, May 17, 2024

అందుబాటులోకి ఈవినింగ్‌ క్లినిక్‌లు… కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పేద, నిరుపేద రోగుల కోసం ఈవినింగ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు. సాయంత్రం ఓపీ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, ఆరోగ్య సలహాలు, పరీక్షలు చేయించుకునేందుకు అనువుగా ఉన్నాయని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బోధనాసుపత్రుల్లో సాయంత్రం ఓపీ సేవలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభం కాగా… తాజాగా హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రిలో ఈ రోజు (సోమవారం) నుంచి ఈవినింగ్‌ ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో గాంధీ ఆసుపత్రితోపాటు ఇతర ప్రభుత్వ బోధనా వైద్య కళాశాలల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు నెలలో తెలంగాణ వైద్య విధానపరిషత్‌ పరిధిలోని ఆసుపత్రులతోపాటు జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లోనూ ఈవినింగ్‌ ఓపీ క్లినిక్‌లను అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బోధనా కళాశాలల్లో ఈవినింగ్‌ ఓపీ సేవలపై అధ్యయనం చేశాక తుది నిర్ణయాన్ని ప్రకటించే యోచనలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ఉన్నట్లు సమాచారం.
ఈవినింగ్‌ ఓపీ సేవల్లో భాగంగా…

జనరల్‌ మెడిసిన్‌తోపాటు జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్‌ విభాగాలతో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఓపీ సేవలను అందిస్తున్నారు. ల్యాబ్‌ ఇన్వెస్టిగేషన్‌ రిపోర్టు కూడా అదే రోజు అందిస్తున్నారు. ఈవినింగ్‌ ఓపీ నేపథ్యంలో డిస్పెన్సరీల్లో మందులను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఓపీ రోగులకు అల్ట్రాసౌండ్‌ పరీక్షలను ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నారు. సాయంత్రం క్లినిక్‌లలో సమీక్ష కోసం అదే రోజు నివేదికలు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలోని బోధనా కళాశాలల్లో ప్రతీ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈవినింగ్‌ ఓపీ సేవలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం మాత్రమే అందించే ఓపీ సేవలతో సుదూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చే రోగులకు ఎంతో ఇబ్బంది కలుగుతోందని మంత్రి హరీష్‌రావు భావిస్తున్నారు. రోగులకు ఉదయం ఓపీలో పరీక్షలు చేస్తే ఆ టెస్టుల ఆధారంగా మందులు పొందాలంటే మరుసటి రోజు ఓపీ వరకు వేచి చూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఏ రోజు చేసిన టెస్టులకు అదే రోజు ఈవినింగ్‌ ఓపీలో మందులు రాసివ్వాలని, అవసరమైన వారిని ఇన్‌పేషెంట్లుగా చేర్చుకోవాలని డీఎంఈ. రమేష్‌రెడ్డి అన్ని బోధనాసుపత్రులకు ఆదేశాలు జారీ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement