Sunday, May 5, 2024

ఢిల్లీ తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాలివ్వండి.. కేటీఆర్‌కు టీయూడబ్ల్యూజే విజ్ఞప్తి..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీలో పని చేస్తున్న తెలంగాణకు చెందిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు హామీ ఇచ్చారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి యశ్వంత్ సిన్హా నామినేషన్‌ దాఖలు ప్రక్రియకు హాజరైన మంత్రి కేటీఆర్ ఆ కార్యక్రమం తర్వాత టీఆర్‌ఎస్ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయనను కలిసిన టీయూడబ్ల్యుజే ఢిల్లీ కమిటీ అధ్యక్షుడు నాగిళ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సంబంధించిన మూడు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. దేశ రాజధానిలో పని చేస్తున్న తెలంగాణ‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇవ్వాల‌ని కోరారు. అలాగే ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్‌లో ఖాళీగా ఉన్న క్వార్ట‌ర్ల‌ను అద్దె ప్రాతిపదిక‌న తమకు కేటాయించాలని యూనియ‌న్ నేత‌లు మంత్రికి విజ్ఞప్తి చేశారు. జ‌ర్న‌లిస్టుల‌కు త్వరిత‌గ‌తిన స‌మాచారం చేరవేసేందుకు మీడియా సెంట‌ర్‌ను బ‌లోపేతం చేయాల‌ని కోరారు.

ఈ అంశాల‌పై అప్ప‌టిక‌ప్పుడు స్పందించిన మంత్రి కేటీఆర్‌, జిల్లాల‌లో ఇప్ప‌టికే జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇస్తున్నామ‌ని, ఢిల్లీ జ‌ర్నలిస్టుల‌కు సైతం స్థ‌లాలు కేటాయిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఖాళీగా ఉన్న క్వార్ట‌ర్ల‌ను అద్దె ప్రాతిప‌దిక‌న కేటాయింపుపై చర్యలు చేపట్టాలని తెలంగాణ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్‌ను ఆదేశించారు. దీంతోపాటు జ‌ర్న‌లిస్టుల ఇత‌ర‌ స‌మ‌స్య‌ల‌నూ ప‌రిష్క‌రించాల‌ని మంత్రి కేటీఆర్‌ ఆర్సీకి సూచించారు. అనంత‌రం ఆర్సీ గౌరవ్ ఉప్పల్ యూనియ‌న్ నేత‌ల‌ను మంగ‌ళ‌వారం స‌మావేశానికి రావాల‌్సిందిగా ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీయూడబ్ల్యుజే ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శి తిరుప‌తి, కోశాధికారి శిరీష్‌రెడ్డి, ఉపాధ్య‌క్షులు స్వ‌రూప‌, ర‌వీంద‌ర్ రెడ్డి, కార్య‌ద‌ర్శులు రాజు, నాయ‌క్‌, యూనియ‌న్ నేత‌లు గోపీకృష్ణ, విజ‌య్‌, స‌తీష్‌, అశోక్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement