Sunday, May 19, 2024

TS | మళ్లీ బీజేపీ వస్తే పెట్రోల్, డీజిల్ రూ.400: కేసీఆర్

కామారెడ్డి, ప్రభన్యూస్‌ ప్రతినిధి: బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై భారాస అధినేత కేసీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబ్‌ కీ బార్‌ చార్‌ సౌ పార్‌ అని బీజేపోళ్లు గ్యాస్‌ కొడుతున్నారన్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ గెలిస్తే పెట్రోల్‌, డీజెల్‌ ధరలు రూ.400 అవుతుందని విమర్శలు గుప్పించారు.

కామారెడ్డి జిల్లా ఉండాల్నా.. పోవాల్నా..? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి తీసేస్తా అంటున్నాడని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా ఉండాలంటే భారాసను గెలిపించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఈ దేశం మనది, రాష్ట్రం మనది, దయచేసి ఆలోచించి ఓటు వేయాలని యువతకు విజ్ఞప్తి చేశారు.

పదేళ్లు దేశాన్ని పాలించిన ప్రధాని నరేంద్ర మోడీ 150 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆరోపించారు. దేశాన్ని అన్ని విధాలలో దెబ్బతీస్తున్నారని అన్నారు. ఆర్థిక వ్యవస్థ బాగా లేకుండా పోయిందన్నారు. డిజిటల్‌ ఇండియా అంటూ ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. కామారెడ్డిలో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేకు నియోజకవర్గ అభివృద్ధి కోసం 30 కోట్లు ఇస్తామన్న మోడీ ఏ ఒక రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

ఈసారి కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని జోస్యం చెప్పారు. బీజేపీకి 200 సీట్లు కూడా రావని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కామారెడ్డి ప్రాంతం కీలక పాత్ర ఉందని ఈ సందర్భంగా కేసీఆర్‌ గుర్తు చేశారు. తాను బతికి ఉన్నన్ని రోజులు కామారెడ్డిని మర్చిపోనని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోనే కామారెడ్డికి ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. కామారెడ్డిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని వివరించారు.

దొంగ మాటల చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. నాలుగు నెలల్లోనే ప్రజలు ఆ పాలనపై విసుగుచెందారని చెప్పారు. మనం ఇచ్చిన కరెంటు పోయింది. మంచినీళ్లు పోయినాయి. రైతుబంధు పోయింది.. రైతు బీమా కూడా ఉంటదో పోతదో తెలియదు.. నిరుద్యోగులకు రూ.4 వేల నిరుద్యోగ భృతి అన్నారు.. యువ వికాసం అని రూ.5 లక్షలు బ్యాంక్‌ కార్డు ఇస్తామన్నారు? ఏ విద్యార్థికైనా ఇచ్చారా? ఇవన్నీ ఇయ్యకపోతే ఇయ్యకపోయారు.

- Advertisement -

మన గవర్నమెంట్‌ ఉన్నప్పుడు ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వట్లేదు. సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్స్‌ 1100 పెట్టినం. వాటిని జూనియర్‌ కాలేజీలు చేసినం. అక్కడ పిల్లలకు అన్నం కూడా సరిగ్గా పెడతలేరు. 125 స్కూళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రి పాలవుతున్నారు. రాష్ట్రంలో అసలేం జరగుతుందని ప్రశ్నించారు.

5 నెలల్లో ఇంత ఆగమాగం ఉంటదా? అని నిలదీశారు. కేసీఆర్‌ పోగానే కట్క బంద్‌ చేసినట్టే కరెంటు బంద్‌ అయితదా? నల్లాలు బంద్‌ అయితయా? రైతుబంధు బంద్‌ అయితదా? అని ప్రశ్నించారు. డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయ్‌.. ఏం జరుగుతుందనేది దయచేసి ఆలోచన చేయాలని ప్రజలకు సూచించారు. కామారెడ్డి ప్రాంతం మరింత అభివృద్ధి జరగాలంటే జహీహరాబాద్‌ ఎంపీగా గాలి అనిల్‌ కుమార్‌ను గెలిపించాలని ఆయన సూచించారు.

నాలుగు వేల ఫించన్‌ ఇస్తానన్నడు.. ఎప్పుడు ఇస్తాడు..?

మొన్నటి ఎన్నికల్లో ఆరు గ్యారంటీల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రెండు వేలు కాదు నాలుగు వేల పింఛన్‌ ఇస్తామని చెప్పిండు.. ఎవరికైనా వచ్చిందా అని కేసీఆర్‌ ప్రశ్నించారు. కొత్తగా వచ్చే నాలుగు వేలు రాకపోగా.. జనవరి నెలలో రెండు వేల పింఛన్‌ కూడా ఇవ్వలేదన్నారు. ఇచ్చిన వాగ్దానాలు భంగం చేయడమే కాకుండా.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పటి సంక్షేమ పథకాలను, రైతు పథకాలను, విద్యార్థి పథకాలను రద్దు చేశారని తెలిపారు.

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లలకు, చదువుకునే వాళ్లకు స్కూటీలు కొనిస్తామని అన్నారు.. స్కూటీలు రాలేదు కానీ లూటీలు మాత్రం మొదలైనయని తెలిపారు. ఈ విధంగా ఏ ఒక్క స్కీమ్‌ అమలు చేయలేదన్నారు. కామారెడ్డి జిల్లా చాలా చైతన్యం ఉన్న గడ్డ.. తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండమైన పోరాటం చేసిన గడ్డ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఇదే కామారెడ్డి పట్టణంలో పోలీసు కిష్టయ్య పిస్టోల్‌తో కాల్చుకుని అమరుడయ్యారని గుర్తు చేశారు. ఆనాడు చాలా కష్టపడి, అనేక సంవత్సరాలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. పొదరిల్లులా చేసుకున్నాం. వ్యవసాయం బాగా చేసుకున్నాం. పేద, ముసలి వాళ్లకు 2 వేల పింఛన్‌ ఇచ్చుకున్నాం. బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడా ఇవ్వనట్టుగా రెండు వేల పింఛన్‌ ఇచ్చుకున్నాం అని కేసీఆర్‌ తెలిపారు.

కాంగ్రెస్‌ మెడలు వంచాలంటే భారాసను గెలిపించాలే

భారాస ప్రభుత్వం ఉన్నప్పుడు పరిశ్రమలు, ఐటీ రంగంలో విశేష కృషి చేసి బ్రహ్మాండమైన పెట్టు-బడులు తెచ్చినం అని కేసీఆర్‌ గుర్తు చేశారు. ఇవాళ కరెంటు- కోతల కారణంగా పెట్టుబడులన్నీ వాపస్‌ పోయే పరిస్థితి వస్తుంది. వెయ్యి కోట్లు చేసే పరిశ్రమ ఇప్పటికే మద్రాసు తరలిపోయింది.. ఇదే రకంగా జరిగితే చాలా కష్టమవుతుంది. అని కేసీఆర్‌ అన్నారు. అందుకే మన నదుల నీళ్లు కాపాడుకోవాలన్నా.. ఈ కాంగ్రెస్‌ పార్టీ మెడలు వంచి మీకిచ్చిన గ్యారంటీలు అమలు చేయాలన్నా.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఆస్థిత్వాన్ని రక్షించాలన్నా.. బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని కోరారు.

బీఆర్‌ఎస్‌కు 12 నుంచి 13 పార్లమెంటు మెంబర్లను గెలిపించి ఇస్తే కాంగ్రెస్‌ మెడలు వంచగలుగుతాం.. హామీలు అన్నీ అమలు చేయించగలుగుతామని తెలిపారు. నదులను కాపాడగలుగతాం.. తెలంగాణ హక్కులు కాపాడగలుగుతామన్నారు. తాము అధికారంలో లేకున్నా ప్రజల పక్షాన పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement