Thursday, October 10, 2024

TS | వణికిస్తున్న వైరల్ ఫీవ‌ర్.. విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరం

ఉత్తర తెలంగాణ, ప్రభన్యూస్‌ బ్యూరో: ఇటీవల భారీగా వర్షాలు కురవడంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పారిశుధ్యం ప్రధాన సమస్యగా మారింది. స్వచ్ఛ గ్రామాలు, పట్టణాలుగా ప్రకటనలకే పరిమితం అయ్యారని క్షేత్ర స్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన పదిరోజులుగా ఉత్తర తెలంగాణ ఉమ్మడి నిజామాబాద్‌, అదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోని పల్లెలు, పట్టణాలు జ్వరాలతో వణికిపోతున్నాయి. ఏ పల్లెను చూసినా జ్వరాలు, దగ్గు, జలుబుతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

పల్లెలు, పట్టణాల్లో సరైన పారిశుధ్య పనులు చేపట్టకపోవడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎటుచూసినా మురికి కూపాలుగా మురికి కాలువలు కనిపిస్తున్నాయి. చెత్త, చెదారం పేరుకుపోయి మురికివాడలుగా మారిపోయాయి. వర్షాకాలం వచ్చిందంటే వైరల్‌ జ్వరాలు, వాంతులు, విరోచనాలతో జనాలు అవస్థలపాలవుతున్నారు. రోగాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలం అవుతుందనే విమర్శలు ఉన్నాయి.

- Advertisement -

విజృంభించిన డెంగ్యూ జ్వరాలతో భయం.. భయం

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో డెంగ్యూ కోరలు చాచింది. తీవ్రమైన జ్వరం, ప్లేట్‌లెట్స్‌ పడిపోవడంతో జనం డెంగ్యూ అంటేనే బెంబేలెత్తి పోతున్నారు. డెంగ్యూ జ్వరాలతో పాటు అంతుచిక్కని వైరల్‌ ఫీవర్‌ మరింత భయాందోళనలు కలిగిస్తోంది. సాధారణ మనిషికి ప్లేట్‌లెట్స్‌ లక్ష యాభై వేలు పైగా ఉండాలి. జ్వరం రావడంతో ఒక్కసారిగా 30 వేల లోపుకు ప్లేట్‌లెట్స్‌ పడిపోతున్నాయి. అత్యవసరంగా ప్లేట్స్‌లెట్స్‌ ఎక్కించడం, వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందివ్వకపోతే రోగి మరణిస్తున్న సంఘటనలు ఉన్నాయి.

ఒక్క నిజామాబాద్‌ జిల్లాలోనే ఈ సీజన్లో 310 మందికి అధికారికంగా డెంగ్యూ వ్యాధి సోకినట్లు లెక్కలు చెపుతున్నాయి. నగరంలోని దుబ్బ, ఏడపల్లి మండల కేంద్రం, జక్రాన్‌ పల్లి మండలం అర్గుల్‌కు చెందిన ముగ్గురు డెంగ్యూతో మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వేలల్లో డెంగ్యూ కేసులు నమోదై జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం కోసం రోగులు క్యూ కడుతున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు వైరల్‌ జ్వరాలు, డెంగ్యూ జ్వరాల కేసులతో కిక్కిరిసిపోతున్నాయి.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాతో పాటు కరీంనగర్‌, అదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో వేల సంఖ్యలో డెంగ్యూ కేసులు నిత్యం నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని తండాల్లో జ్వరాలతో గిరిజన ప్రజలు తల్లడిల్లుతున్నారు. వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేక, బెడ్స్‌ సరిపోక ప్రైవేట్‌కు పరుగులు పెడుతున్నారు.

డెంగ్యూతో పాటు శ్వాస కోస సంబంధిత వ్యాధులు ఆందోళన కలిగిస్తున్నాయి. జ్వరాలు రావడంతో ప్రభావం ఊపిరితిత్తులపై పడుతోంది. శ్వాస కోసం సంబంధ చికిత్స చేయాల్సిన పల్మనాలజీ వైద్యులు లేకపోవడంతో ఇక ఉన్న వైద్యులే శ్వాస కోస వైద్యం అందిస్తున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేక ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో..

డెంగ్యూ, వైరల్‌ జ్వరాలు, ఊపిరితిత్తుల సమస్యలతో విపరీతమైన కేసులు నమోదు అవుతున్నాయి. గతంలో 2021లో భారీగా డెంగ్యూ కేసులు నమోదు అయినప్పటికీ, ఇంతగా ప్రజలు ఇబ్బందులపాలు కాలేదు. కరోనా మహమ్మారి తర్వాత జ్వరం అంటేనే జనాలు జంకుతున్నారు. వీటికి తోడు వైరల్‌ జ్వరాలు డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాయి అంటూ సోషల్‌ మీడియాలో పుకార్లు చేయడంతో ప్రజలు భయపడుతున్నారు. మరో భయంకరమైన వైరస్‌ వస్తోంది అంటూ అబద్ధపు ప్రచారం జరుగుతోంది.

ఇదే సమయంలో వైరల్‌ జ్వరాలు ఎంతకూ తగ్గకపోవడం మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే తీవ్ర జ్వరాలతో ప్రజలు నిత్యం వందల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు లైన్‌ కడుతున్నారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీస వసతులు, బెడ్స్‌ లేకపోవడం, వైద్యులు అందుబాటులో లేకపోవడం, సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో జిల్లా ఆస్పత్రికి వస్తున్నారు.

ఇక్కడ కూడా రోగులకు సరిపడా సౌకర్యాలు లేవు. దీంతో ప్రాణ భయంతో ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్‌ ఆస్పత్రులు రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అడ్డగోలుగా మందులు, బిల్లులు వేస్తున్నారు. అడ్వాన్స్‌గా డబ్బులు చెల్లిస్తేనే ఆస్పత్రుల్లో చేర్చుకుంటున్నారు. విపరీతమైన పరీక్షలు చేస్తున్నారు. కరోనా సమయంలో దోపిడీ చేసిన ప్రైవేట్‌ ఆస్పత్రులు మళ్ళీ డెంగ్యూ, వైరల్‌ జ్వరాలతో రోగులను పీల్చి పిప్పి చేస్తున్నాయి.

ప్రధానంగా 18 ఏళ్ల లోపు పిల్లల్లో, 60 ఏళ్లు దాటిన వారిలో పాటు బాలింతలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు డెంగ్యూ, వైరల్‌ జ్వరాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారని వైద్యులు చెపుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఆందోళనకర పరిస్థితిపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

పారిశుధ్యంపై నిర్లక్ష్యమే ప్రాణాల మీదికి..!

రోగాలకు ప్రధాన కారణం పారిశుద్ధ్యమే. అధికారులు, ప్రజాప్రతనిధులంతా ఎన్నికల హడావుడిలో ఉండడంతో ఇక ప్రజల్ని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. వర్షాలు విపరీతంగా కురవడంతో, మురికి రోడ్లపైకి రావడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమల నివారణకు కనీస చర్యలు లేవు.

డ్రైనేజీ వ్యవస్థ బాగుచేయడంలో నిర్లక్ష్యం మూలంగా ప్రజల ప్రాణాల మీదికి వస్తోంది. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు హడావుడి చేసిన అధికారులు, ప్రజాప్రతి నిధులంతా ముందస్తు చర్యలు చేపట్టకపోగా, ప్రస్తుత పరిస్థితిపై చర్యలు చేపట్టకపోవడం విచారకరం. వెంటనే సంభందిత శాఖల అధికారులు చర్యలు చేపట్టి పారిశుధ్య సమస్యను పరిష్కరించాల్సిన భాధ్యత అత్యవసరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement