Friday, May 17, 2024

IPL : ధోనీ బ్యాటింగ్ సీక్రెట్ ….

42 ఏళ్ల వయసులోనూ మహేంద్ర సింగ్ ధోనీ ధనాధన్ షాట్లతో, మెరుపు వికెట్ కీపింగ్‌తో అలరిస్తున్నాడు. అంతేగాక ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చి మ్యాచ్‌ను మలుపుతిప్పే పరుగులు సాధిస్తున్నాడు . ఐపీఎల్-2024లో బెస్ట్ బ్యాటింగ్ ఏవరేజ్ బ్యాటర్‌గా మహీ 110 సగటుతో టాప్‌లో ఉన్నాడు. ఇక అత్యుత్తమ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ జాబితాలోనూ 229తో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

- Advertisement -

అయితే ధోనీ ఇలా గొప్ప ప్రదర్శన చేయడానికి గల కారణాలను మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ విశ్లేషించాడు. చెన్నై సూపర్ కింగ్స్ వ్యూహాలతో ధోనీకి స్వేచ్ఛ వచ్చిందని అన్నాడు. ఓ బ్యాటర్ 20-25 బంతులు ఎదుర్కొంటే బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాలని, కానీ పది బంతులు ఆడితే స్వేచ్ఛగా బ్యాటును ఝుళిపించవచ్చని గంభీర్ చెప్పాడు. ఈ ప్రణాళికతోనే ధోనీ ఇంపాక్ట్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడని వివరించాడు.

”ధోనీ ఎనిమిది నుంచి పది బంతులు ఎదుర్కోవడం సీఎస్కే వ్యూహం. ఇది ధోనీకి స్వేచ్ఛను ఇస్తుంది. ప్రతి జట్టుకు భిన్నమైన ప్రణాళికలు ఉంటాయి. ఈ వ్యూహాన్ని చెన్నై సూపర్ కింగ్స్ గత రెండు-మూడేళ్లుగా అమలు చేస్తోంది. ఈ ఫ్రీడమ్ ధోనీని ఇంపాక్ట్ ఇన్నింగ్స్ ఆడేలా చేస్తోంది. మీరు 20-25 బంతులు ఎదుర్కొంటే బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంటుంది. కానీ కేవలం ఎనిమిది నుంచి పది బంతులు ఆడాల్సి వస్తే.. మనకు నచ్చిన శైలిలో స్వేచ్ఛగా ఆడవచ్చు” అని గంభీర్ పేర్కొన్నాడు.
ఓ ఆటగాడు విఫలమవ్వడానికి కారణం తన స్థానంపై అభద్రత భావమే అని గంభీర్ అన్నాడు. ”ఆటగాళ్ల వైఫల్యానికి ప్రధాన కారణం అభద్రత అని భావిస్తాను. అంతేకానీ సామర్థ్యం గురించి కాదు. మీకు సామర్థ్యం లేకపోతే ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి చేరుకోలేరు. కాబట్టి ఆటగాళ్లకు భద్రతా భావంతో ఉండే డ్రెస్సింగ్ రూమ్ ఉండాలి. అంటే సంతోషంగా ఉండే డ్రెస్సింగ్ రూమ్ ఉండాలి. అలా ఉంటే విజయాలు సాధించవచ్చు” అని గంభీర్ తెలిపాడు. కాగా, గంభీర్ కేకేఆర్ జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు వహిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement