Tuesday, December 5, 2023

Delhi | రాహుల్‌తో మైనంపల్లి బృందం, వేముల వీరేశం భేటీ..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్‌లో చేరిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తదితరులు శుక్రవారం ఉదయం ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, ఎంపీ రాహుల్ గాంధీని కలిశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రేతో పాటు వెళ్లి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో అధికార పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం – ఇద్దరికీ రాహుల్ గాంధీ స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేసినట్టు తెలిసింది.

- Advertisement -
   

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారని నేతలిద్దరూ చెప్పినట్టు తెలిసింది. తెలంగాణలో గెలుపుపై రాహుల్ ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం. గురువారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు, ఆయన కుమారుడు రోహిత్, నక్కా ప్రభాకర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దగ్గరుండి ఈ చేరికల కార్యక్రమాన్ని చూసుకున్నారు.

మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న రాహుల్ గాంధీని శుక్రవారం ఉదయాన్నే వెళ్లి కలిసేలా ఏర్పాట్లు చేశారు. రాహుల్‌తో భేటీ అనంతరం నేతలంతా హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. మైనంపల్లి తనతో పాటు తన కుమారుడు రోహిత్, ముఖ్య అనుచరుడు నక్కా ప్రభాకర్ గౌడ్ కు టికెట్లు ఆశిస్తుండగా.. ఆయా నియోజకవర్గాల్లో సర్వే నివేదికలు సైతం తమకు అనుకూలంగా ఉన్నాయని గురువారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement