Saturday, April 27, 2024

డిగ్రీకి డిమాండ్‌ పెంచేలా.. ఉద్యోగాలు లభించే కొత్త కోర్సులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: డిగ్రీ పూర్తి చేసిన వారికి వెనువెంటనే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించేలా తెలంగాణ ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న కొన్ని డిగ్రీ కోర్సులకు ఆదరణ కరువవడంతో డిగ్రీ విద్యకు మరింత ఆదరణ పెంచేలా కొత్త కోర్సులను తీసుకొరాబోతుంది. డిగ్రీలో ప్రవేశాలు పొందేటప్పుడే…ఏ కోర్సు చేస్తే ఏ రంగంలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పొందొచ్చనే దానిపై అధ్యయనం చేసి కొత్త కోర్సులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టనుంది. అందుకు డిగ్రీ కోర్సులకు సంబంధించిన కరిక్యులమ్‌, క్రెడిట్స్‌, గ్రేడింగ్‌ విషయాలపై అధ్యాయనం చేసి ఉపాధి అవకాశాలు వెనువెంటనే లభించే ఎమర్జింగ్‌ కోర్సులను ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది. ఇందుకు త్రిసభ్య కమిటీని ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొ.మల్లేష్‌, ఉస్మానియా వర్సిటీ వీసీ ప్రొ.డి.రవీందర్‌, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ సిహెచ్‌.గోపాల్‌ రెడ్డిలు ఉన్నారు. శనివారం తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆరు యూనివర్సిటీల వీసీలతో మండలి ఛైర్మన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి, వైస్‌ ఛైర్మన్‌ ప్రొ.వెంకటరమణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కామన్‌ అకాడమిక్‌ క్యాలెండర్‌, కొత్త కోర్సులు, యూనివర్సిటీల్లో డ్రగ్స్‌, సైబర్‌ నేరాల నియంత్రణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

డిగ్రీకి పెరగనున్న డిమాండ్‌…

ఇప్పటి వరకు డిగ్రీకి అంత ఆదరణ లేదు. అందులో కొన్ని కోర్సులకే మంచి ఆదరణ ఉంది. దాంతో ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఎక్కువగా ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ కోర్సులు చేయడానికే మొగ్గు చూపుతున్న పరిస్థితి గత కొన్నేళ్లుగా ఉంది. ఇంజనీరింగ్‌, మెడిసిస్‌, ఇతర కోర్సులు చేస్తే వెంటనే ఉద్యోగాలు లభిస్తాయనే భావన విద్యార్థుల్లో ఉండడంతో డిగ్రీ కోర్సులకు ఆదరణ తగ్గుతోంది. దీంతో ప్రతి ఏటా 2.50 లక్షల వరకు సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఐటీ, సర్వీస్‌ సెక్టార్‌, పారిశ్రామిక రంగాల్లో అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేలా కొత్త కోర్సులను ప్రవేశపెట్టనుంది. కోర్సు పూర్తయ్యే సారికి జాబ్‌ వర్క్‌పై అవగాహన కలిగించేలా కోర్సులను, కరిక్యులమ్‌ను రూపొందించనున్నారు. క్రెడిట్‌ పాయింట్లు, గ్రేడింగ్‌ ద్వారా విద్యార్థులు ఎలాంటి ఉద్యోగాలకు నైపుణ్యాలు పొంది ఉన్నారో తేలిగ్గా గుర్తించేలా కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ కోర్సులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఛైర్మన్‌ లింబాద్రి తెలిపారు.

డ్రగ్స్‌ కమిటీలు…

- Advertisement -

ఈ రోజు యువతను ప్రభావితం చేస్తున్న వాటిలో డ్రగ్స్‌, సైబర్‌ నేరాలు. వీటిని నివారించేందుకు, వీటి బారిన పడకుండా ఉండేందుకు అధికారులు దృష్టి సారించారు. కొన్ని కాలేజీల్లోని విద్యార్థులు డ్రగ్స్‌ బారిన పడుతున్నారనే విషయం అధికారుల దృష్టికి రావడంతో డ్రగ్స్‌, సైబర్‌ నేరాలను నివారించేందుకు చర్యలు చేపట్టారు. యూనివర్సిటీల స్థాయిలో వీటిపై అవగాహన కల్పించడానికి కమిటీలను వేయాలని నిర్ణయించారు. ఈ కమిటీలో సభ్యులుగా లీగల్‌ సెల్‌ అధికారులు, పోలీస్‌ అధికారులు, యూనివర్సిటీ అధికారులు ఉండేలా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. యాంటి ర్యాగింగ్‌ తరహాలో ఈ కమిటీలు పనిచేయనున్నాయి. అదేవిధంగా యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ నిరోధించేందుకు వర్సిటీల స్థాయిలో రెండు క్రెడిట్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

వర్సిటీల్లో ఒకే సారి క్లాసులు…

ఆరు యూనివర్సిటీలైన ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన యూనివర్సిటీల్లో కామన్‌ అకాడమిక్‌ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఒకేసారి తరగతులు, పరీక్షలు నిర్వహించేలా నిర్ణయించారు. ఇప్పటికే అక్టోబర్‌ 10 నుంచే యూజీ కోర్సుల తరగతులు ప్రారంభమయ్యాయి. అలాగే పీజీ కోర్సులు మొదటి సంవత్సరం ఫస్ట్‌ సెమిస్టర్‌ తరగతులను ఈ నెల 31 నుంచి ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు ఒక్కో వర్సిటీ పరిధిలోని కాలేజీల తరగతులు, పరీక్షలు, ఫలితాల ప్రకటన వేరువేరుగా ఉండేది. ఇకపై ఒకే సారి పరీక్షలు, తరగుతుల ప్రారంభం, పరీక్షల నిర్వహణ చేపట్టేలా కామన్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టనున్నారు. తద్వారా యూజీ, పీజీ తరగతులపై ఒక స్పష్టత ఉంటుంది. దాని ప్రకారం పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు విద్యార్థులు ప్రణాళికలు రచించుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement