Monday, May 6, 2024

ఒక మొక్కకు మూడు కూరగాయలు.. వారణాసి ఐసిఎఆర్‌ శాస్త్రవేత్తల పరిశోధన

ఇంటి ఆవరణలో రెండు మూడు మొక్కలతో అన్ని రకాల కూరగాయలను పండించే రోజులు వస్తున్నాయి. ఈ దిశగా శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు సత్ఫలితాన్నిస్తున్నాయి. వారణాసిలో ఐసిఎఆర్‌ కి చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వెజిటబుల్స్‌ రీసెర్చి (ఐఐవిఆర్‌) శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒకే మొక్క ద్వారా వంకాయ, టమాటా, మిర్చి కూరగాయలను పండించే విధానంపై పరిశోధనలు చేస్తున్నారు. ఈవిధమైన ప్లాంట్‌కు ఇంకా పేరు పెట్టలేదు.

వీరు గతంలో ఒకే మొక్క నుంచి బంగాళాదుపం, టమాటాను పండించే పొమాటో, వంకాయ-టమాను పండించే బ్రిమాటో మొక్కలను అభివృద్ధిచేశారు. గ్రాఫ్టింగ్‌ టెక్నిక్‌ని ఉపయోగించి ఐసిఎఆర్‌-ఐఐవిఆర్‌ శాస్త్రవేత్తలు మొదట పొమాటోను అభివృద్ధి చేశారు. ఐఐవిఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టికె బెహెరా మార్గదర్శకత్వంలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ అనంత్‌ బహదూర్‌, వారణాసిలోని ఐసిఎఆర్‌, ఐఐవిఆర్‌ వద్ద మూడు కూరగాయలు అందించే పంట ఉత్పత్తిపై దృష్టిసారించారు.

ఈ ప్రక్రియలో వంకాయ వేరుకాండం మీద మిరప, టమాటా మొక్కలను అంటుకట్టారు. 2024 జనవరి చివరినాటికి మిరపకాయ, బెండకాయ, టమాటా దిగుబడి కూడా ప్రారంభం అవుతుందని డాక్టర్‌ బహదూర్‌ చెప్పారు. దీని సాధ్యాసాధ్యాలను విశ్లేషిస్తున్నామన్నారు. ఒక మొక్క కనీసంగా 3 కిలోల టమాటా, 2.5 కిలోల బెండకాయల దిగుబడిని ఇస్తుందని చెప్పారు. ఈ మొక్కలు కిచెన్‌ గార్డెన్స్‌, పెరట్లలోను, చిన్న పొలాల్లో సాగు చేసుకునేందుకు వీలుగా ఉంటాయని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement