Sunday, May 5, 2024

Delhi | ఏపీ, తెలంగాణ రాష్ట్రాల రైల్వే బడ్జెట్ ఇదే.. అశ్విని వైష్ణవ్ వెల్లడి !

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బడ్జెట్ కేటాయింపులు జరిపారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన రైల్వే భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులపై వివరాలు వెల్లడించారు. 2009-14లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్ కేవలం రూ. 886 కోట్లు మాత్రమే ఉండేదని గుర్తు చేశారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు రూ. 9,138 కోట్లు కేటాయించామని హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో 97శాతం రైల్వే ట్రాక్స్‌కి విద్యుదీకరణ పూర్తైందని చెప్పారు. రాష్ట్రంలో 72 స్టేషన్లు అమృత్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నామని, 709 ఫ్లై ఓవర్లు, అండర్ బ్రిడ్జిల నిర్మాణం జరుగుతోందని అశ్విని వైష్ణవ్ అన్నారు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే ఈ ఏడాది రూ. 5,071 కోట్ల రైల్వే కేటాయింపులు జరిపినట్టు తెలిపారు. 850 శాతం వృద్ధితో కొత్త లైన్ల నిర్మాణం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో 100శాతం ఎలక్ట్రిక్ ట్రాక్స్ నిర్మాణం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. 40 అమృత్ స్టేషన్లు తెలంగాణలో నిర్మిస్తున్నామని చెప్పారు. వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్టాల్స్ రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేశామని అశ్విని వైష్ణవ్ వివరించారు. తద్వారా రైల్వే స్టేషన్లలో ఆయా జిల్లాల ఉత్పత్తులు 10 రెట్ల ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

వైజాగ్ రైల్వే జోన్ కోసం 53 ఎకరాల స్థలం అవసరమని కేంద్రమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించగానే పనులు వేగం అందుకుంటాయని తెలిపారు. స్థలం కేటాయింపుకు సంబంధించి తమకు ఎలాంటి వివరాలూ అందలేదని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అయోధ్యకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కొత్త రైళ్లు వేస్తామని ఆయన హామీ ఇఛ్చారు. వారానికి ఒక కొత్త రైళ్ల నిర్మాణం జరుగుతోందని స్పష్టం చేశారు. కొత్త రైళ్లు అందుబాటులోకి రాగానే కొత్త సర్వీస్ మొదలవుతుందని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రలో అనేక వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని కేంద్రమంత్రి వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement