Saturday, May 18, 2024

TS | మరో రెండు గ్యారంటీల అమలుకు స‌న్నాహాలు..

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలను అమలు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. ప్రజాపాలన దరఖాస్తులపై ఇవ్వాల (గురువారం) సచివాలయంలో కేబినేట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారంటీలను అమలు చేస్తామని ఈ సందర్భంగా సీఎం అన్నారు.

రూ.500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాలపై సంబంధిత విభాగాల అధికారులతో సీఎం చర్చించారు. ఈ మూడు గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వీటిలో రెండింటిని తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఒక్కో గ్యారంటీ అమలుకు ఎంత ఖర్చవుతుంది.. ఎంత మందికి లబ్ధి కలుగుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బడ్జెట్‌లోనే వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి కేబినేట్ సబ్ కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement