Monday, April 29, 2024

Big story | రోబోల కాలమిది.. ఉపాధి పాయె, భద్రత కరువాయె

(న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి) : గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ పరిసరాల్ని శుభ్రపర్చే 150మంది కార్మికుల్ని టూరిజం ఎక్యులేటరీ అథారిటీ తొలగించింది. వారి స్థానంలో పని చేసేందుకు యంత్రాల్ని వినియోగించే ఓ సంస్థకు కాంట్రాక్ట్‌ ఇచ్చింది. గుజరాత్‌లోని సనంద్‌ పట్టణంలో గల ఫోర్డ్‌ మోటార్స్‌లో ఇటీవల 453 రోబోల్ని ప్రవేశపెట్టారు. దీంతో 2700 మందికి పైగా కార్మికులు తమ ఉద్యోగాల్ని కోల్పోయారు. ఈ కర్మాగారంలో 90శాతం పనుల్ని ఇప్పుడు రోబోలే నిర్వహిస్తున్నాయి. తాజాగా చెన్నైలోని హుందయ్‌ కార్ల పరిశ్రమ కూడా 400రోబోల్ని పనిలో పెట్టుకుంది. పుణలోని ఓక్స్‌ వేగన్‌ కూడా 120రోబోల్ని బరిలో దింపింది. దీంతో వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు.

బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ కూడా పారిశుద్ధ్య నిర్వహణలో యంత్రాల్ని ప్రవేశపెట్టింది. 1993నాటి పారిశుద్ధ్య చట్టాన్ని ఇందుకు ఆసరాగా చేసుకుంది. దేశంలోని అన్నిరంగాల్లో ఇప్పుడు యంత్రాలు ప్రవేశిస్తున్నాయి. దీంతో పనిలో వేగం, స్పష్టత పెరుగుతున్నాయి. అదే సమయంలో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. భారత్‌లో ఇప్పటికీ 69శాతం మంది రోజువారి కార్మికులు, కూలీలుగానే జీవిస్తున్నారు. వీరికి వ్యవసాయరంగం అత్యధికంగా ఉపాధి అవకాశాల్ని కల్పిస్తోంది. ఆ తర్వాత భవన నిర్మాణరంగంలో ఎక్కువమందికి రోజువారి పని లభిస్తోంది. వీరే కాక అసంఘటిత రంగంలో 37కోట్ల మంది పని చేస్తున్నారు. వీరంతా ఉత్పాదకరంగంలోనే ఉన్నారు. వివిధ పరిశ్రమలు, సంస్థల్లో ఉపాధి పొందుతున్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న యాంత్రీకరణ ప్రభావం ఇప్పుడు భారత్‌లో కూడా విస్తృతమైంది.

- Advertisement -

ఇందుకు కొవిడ్‌-19 ప్రధాన హేతువుగా మారింది. కొవిడ్‌ అనంతరం తొలుత సామాజిక దూరాన్ని పాటించే నెపంతో యంత్రాల ప్రవేశం జరిగింది. అనంతరం పనిలో వేగం యాజమాన్యాన్ని యాంత్రీకరణ వైపు ఆకర్షించింది. మొత్తం ఉపాధి రంగాన్నే ఇప్పుడు ఆటోమేషన్‌ తీవ్రంగా దెబ్బతీసింది. భౌతికంగా పనిచేసే అవసరాన్ని రోజురోజుకు ఇది తగ్గిస్తోంది. ఇప్పటికే వ్యవసాయ రంగంలో నాట్ల నుంచి కోతలు, ఆరబోతల వరకు యంత్రాలొచ్చేసాయి. భవన నిర్మాణరంగంలో భారీ యంత్రాలతోపాటు చిన్న చిన్న పనులకు కూడా యంత్ర వినియోగం పెరిగింది. ఒకప్పుడు ఉద్యోగులు, కార్మికులు చేసేందుకు వీల్లేని పనులకు మాత్రమే యంత్రాల్ని వినియోగించే వారు. కాగా ఇప్పుడు రిటైల్‌ దుకాణాల నిర్వహణ నుంచి బిల్లుల వసూళ్ళ వరకు యంత్రాలు ప్రవేశిస్తున్నాయి. ఆఖరకు మనుషులకు జ్వరం ఉందో లేదో తనిఖీ చేసేందుకు యంత్రాల విని యోగం మొదలైంది. ఇక ఆస్పత్రులు, బహుళ అంతస్తుల కార్యాలయాలను శుభ్రం చేసేందుకు తగిన యంత్రాల్ని అందుబాటులోకి తెచ్చేశారు. అలాగే పలు రెస్టారెంట్లు కూడా సర్వర్స్‌ స్థానంలో యంత్రాల్ని వినియోగిస్తున్నాయి.

వ్యవసాయ, నిర్మాణ, పారిశ్రామిక రంగాలతోపాటు ఇప్పుడు పాఠశాలల్లో పాఠాలు చెప్పేందుకు కూడా యంత్రాలు తయారౌతున్నాయి. ఇప్పటికే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ఉపాధ్యాయులు, వ్యాయామ శిక్షకులు, ఆర్థిక సలహాదార్లకు ప్రత్యామ్నాయంగా యంత్రాల తయారీ మొదలైంది. 2030నాటికి అమెరికాలో యంత్రాల కారణంగా 70శాతం మంది కార్మికులు ఉపాధి కోల్పోయే అవకాశాలున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కాగా భారత్‌లో కూడా కార్మికులు అంతే వేగంగా ఉపాధి కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది.

పెట్టుబడిదార్లు, పరిశ్రమల అధిపతులు కార్మిక శక్తి కంటే యంత్రాలపై ఎక్కువగా ఆధారపడ్డానికి ప్రధాన కారణం కొవిడ్‌ అనంతరం పేద, మధ్యతరగతి వ్యక్తుల్లో తగ్గిన పనిసామర్థ్యం. కొవిడ్‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశంలోని 81శాతం మందిపై ప్రభావం చూపింది. కొవిడ్‌కి సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలకంటే కొన్నిరెట్ల మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ప్రాణాలతో భయపడ్డా వీరిలోని అవయవాలు నీరసించాయి. కొవిడ్‌ సమయంలో విధించిన లాక్‌డౌన్‌లు పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాల్ని తీవ్రంగా దిగజార్చాయి. భారత్‌లో జనసాంద్రత అత్యధికం. ఇక్కడ మెజార్టీ ప్రజలు అతితక్కువ విస్తీర్ణం కలిగిన గదుల్లోనే జీవిస్తారు. కొవిడ్‌ ప్రభావం వీరి రోగనిరోధక శక్తిని తీవ్రంగా దెబ్బతీసింది. పేదరికం, మానసిక, శారీరక, దుర్భలత్వాలపై మరింతగా దాడి చేసింది. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది.

కానీ ఇప్పటికే ఈ దేశంలో ప్రతి పదివేల మందికి 7.8మంది వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. అలాగే పేలవమైన ఆరోగ్యవ్యవస్థను ఈ దేశం కలిగున్న విషయం కొవిడ్‌ రెండో తరంగ సమయంలో బట్టబయలైంది. కొవిడ్‌కు గురైన రోగులు కనీస వైద్యం పొందేందుకు కూడా కొన్ని రోజుల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. ఇది వారి దేహంలోని పలు అవయవాలు దెబ్బతినేందుకు దారితీసింది. కొవిడ్‌ సోకినా.. సోకకపోయినా దాదాపుగా కార్మికులంతా ఆ ప్రభావాన్ని ఎదుర్కోక తప్పలేదు. వీరిలో ఇప్పుడు గతంతో పోలిస్తే సగం కూడా పని చేసే సామర్థ్యం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని పారిశ్రామికవేత్తలు ముందుగానే ప్రత్యామ్నాయ అవకాశాల్ని విస్తరించుకున్నారు. ఇది దేశంలో కార్మికుల ఉపాధి భద్రతను తీవ్రంగా దెబ్బతీస్తోంది.

ఒక్క కార్మికులే కాదు.. మహిళల్లో కూడా శారీరక ధారుడ్యం అనూహ్యంగా తగ్గింది. ఆహార కొరత, వ్యాయామం లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. గతేడాదితో పోలిస్తే మహిళల్లో శారీరక పటుత్వం 8నుంచి 10శాతం తగ్గింది. 1985తర్వాత దేశంలోని మహిళలకు బరువు పెరిగింది తప్ప శారీరక బలం పెరగలేదు. ఈ దశలో మూడేళ్ళ క్రితం దాడి చేసిన కొవిడ్‌ వీరిలో రోగనిరోధక శక్తిని తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో మహిళల్లో అత్యధికులు వెన్నునొప్పి, మోకాళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు.

ఇటీవల తెలంగాణ ఆర్‌టీసీ సంస్థ డ్రైవర్ల నియామకం కోసం ఇచ్చిన ప్రకటనకు పెద్దగా స్పందన రాలేదు. డ్రైవర్లకంటే శారీరక శ్రమ పెద్దగా లేని కండక్టర్ల ఉద్యోగాలకు అభ్యర్థులు పోటెత్తారు. ఇందుక్కారణం డ్రైవర్‌ వంటి శారీరక శక్తి, సామర్థ్యాల్ని అధికంగా వినియోగించాల్సిన ఉద్యోగాలపై యువతలో కూడా ఆసక్తి సన్నగిల్లడమే. అలాగే లారీ డ్రైవర్ల ఉద్యోగాలకు కూడా ఎవరూ ముందుకు రావడంలేదు. ఆఖరకు దూరం ప్రయాణించే చిన్నకార్లపై డ్రైవర్‌గా వచ్చేందుకు కూడా భయపడుతున్నారు. గతంతో పోలిస్తే దేశంలో ప్రజల సగటు ఆయుర్దాయం పెరిగింది. 80ఏళ్ళకు పైబడి సునాయాసంగా జీవిస్తున్నారు. అయితే గతంలో 60ఏళ్ళ వ్యక్తి కూడా బలమైన పనులు చేయగలిగేవాడు.

కానీ ఇప్పుడు 50ఏళ్ళ వ్యక్తులు కూడా శారీరక శ్రమకు ఓర్చలేక పోతున్నారు. ఓ వైపు జనంలో శక్తి సన్నగిల్లుతోంది. ఇది వారి ఉపాధి అవకాశాల్ని దెబ్బతీస్తోంది. మరో వైపు ప్రభుత్వాలు యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటికే పరిశ్రమల నుంచి రక్షణ ద ళ వ్యవస్థల వరకు యంత్రాలు చేరిపోయాయి. రాన్రాను భవిష్యత్‌లో ఇవే ఆధిపత్యం వహించే పరిస్థితి స్పష్టమౌతోంది. యంత్రాల్ని కూడా మనుష్యులే నియంత్రించాలి. అయితే సంబంధిత రంగంలో పరిజ్ఞానం కలిగిన వ్యక్తి ఒకే సారి కొన్నివందల యంత్రాల్ని నియంత్రించగలుగుతాడు. సాధారణ కార్మికులు, కూలీలు ఈ పనిని చేయలేరు. వైట్‌కాలర్‌ జాబ్‌లు పెరిగినా దేశంలో అత్యధికులు ఆధారపడుతున్న రంగాల్లో మాత్రం కార్మికులు మొత్తం ఉపాధిని కోల్పోయే, జీవనభద్రతకు దూరమయ్యే ప్రమాదం ఇప్పుడు నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement