Saturday, April 27, 2024

AP | దేవాలయాలలో అన్న ప్రసాద వితరణకు సన్న బియ్యం.. సివిల్‌ సప్లయిస్‌ కార్పోరేషన్‌ ద్వారా కొనుగోళ్లు

అమరావతి, ఆంధ్రప్రభ: మరో కీలక నిర్ణయం దిశగా దేవాదాయశాఖ అడుగులు వేస్తోంది. ఆలయాల్లో అన్నప్రసాద వితరణ, ప్రసాదాల తయారీకి వినియోగించే బియ్యం సివిల్‌ సప్లయిస్‌ కార్పోరేషన్‌ ద్వారా సేకరించేందుకు నిర్ణయించింది. టీటీడీ తరహాలో సివిల్‌ సప్లయిస్‌ కార్పోరేషన్‌ ద్వారా సన్న బియ్యం సేకరణపై అధికారులతో కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ కసరత్తు చేస్తున్నారు. టీటీడీ చెల్లిస్తున్న రేట్లు, సరఫరా విధానం వంటి పలు అంశాలను సేకరించాలని అధికారులకు ఆదేశించారు.ఇదే అంశంపై ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణతో కమిషనర్‌ చర్చించి ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలిసింది.

దేవదాయశాఖలో పాలనాపరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కమిషనర్‌ సత్యనారాయణ.. ఇటీవలే ఆలయాల ఆదాయం, ఖర్చులను డిస్‌ప్లే చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే క్రమంలో ఆలయాలకు సివిల్‌ సప్లయిస్‌ కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో మిల్లర్ల నుంచి సోనా మసూరి బియ్యం సేకరించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్ధానం ఈ తరహా విధానం అమలు చేస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు. అక్కడ అమలు చేస్తున్నప్పుడు ఆలయాల్లో ఎందుకు అమలు చేయరాదనేది కమిషనర్‌ ఆలోచనగా ఉంది. తద్వారా ఆలయాల్లో సరుకుల గోల్‌మాల్‌..అధిక రేట్లకు అడ్డుకట్ట వేయవచ్చనే అభిప్రాయంతో ఉన్నారు.

టీటీడీ తరహాలో..

- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్ధానం(టీటీడీ) సివిల్‌ సప్లయిస్‌ కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో మిల్లర్ల ద్వారా సోనా మసూరి బియ్యం సేకరిస్తోంది. టీటీడీలో రోజువారీ ప్రసాదాల తయారీ, అన్నప్రసాద వితరణ..సహా పెద్ద ఎత్తున బియ్యం అవసరం ఉంటాయి. వీటిని బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాలంటే పెద్ద ఎత్తున ఖర్చు చేయాలి.

దీనిని దృష్టిలో ఉంచుకొని సివిల్‌ సప్లయిస్‌ కార్పోరేషన్‌ ద్వారా సేకరిస్తున్నారు. టీటీడీకి కిలో సోనా మసూరి బియ్యం రూ.49.66కు సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు. ఇదే తరహాలో దేవదాయశాఖ ఆలయాలకు కూడా సరఫరా చేస్తే ఎలా ఉంటుందనే దానిపై కసరత్తు చేస్తున్నారు. అధికారులతో సమీక్షించిన కమిషనర్‌ మరోసారి టీటీడీకి సరఫరా చేస్తున్న విధివిధానాలు అధ్యయనం చేయాలని ఆదేశించినట్లు తెలిసింది.

కందిపప్పు తదితర సరుకులు కూడా..

ఆలయాల్లో ఎక్కువగా వినియోగించే కంది పప్పు, ఇతర సరకులు కూడా ఇదే విధంగా సేకరించాలని దేవదాశాఖ భావిస్తోంది. కందిపప్పు, చింతపండు, నూనె తదితర సరుకులను ప్రభుత్వ సంస్థలకు, రేషన్‌ దుకాణాలకు మార్క్‌ఫెడ్‌ ద్వారా సేకరిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌తో పోల్చితే మార్క్‌ఫెడ్‌ ద్వారా తక్కువ రేటుకు వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే కమిషనర్‌ సత్యనారాయణ అధికారులను మార్క్‌ఫెడ్‌తో చర్చించి రేట్ల వివరాలు, సరుకుల సరఫరా విధానం వంటి అంశాలపై వివరాల సేకరణకు ఆదేశించారు. తొందరలోనే దీనిపై అధికారులు అధ్యయం చేసిన కమిషనర్‌కు నివేదిక ఇవ్వనున్నారు.

ఇప్పుడిలా..

రాష్ట్రంలోని పలు ఆలయాలకు అధికారులే సొంతంగా టెండర్లు పిలిచి సరుకులు కొనుగోలు చేస్తున్నారు. ప్రముఖ ఆలయాలు, జిల్లాల్లో పేరొందిన ఆలయాలకు నిత్యం పెద్ద సంఖ్యలో బియ్యం, పప్పులు, ఇతర సరుకులు అవసరం అవుతాయి. వీటిని ఎక్కడికక్కడే ఈవోలు టెండర్లు పిలిచి కొనుగోలు చేస్తుంటారు. పేరొందిన ఆలయాల్లో కాంట్రాక్టర్లు రింగై పెద్ద మొత్తాలకు టెండర్లు దాఖలు చేస్తుంటారు. ఓ మాదిరి డీసీ, ఏసీ స్థాయి ఆలయాల్లో సైతం ఇదే పరిస్థితి.

పైగా అధికారులతో కుమ్మక్కై నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్నట్లు గతంలో పలు విమర్శలు వచ్చాయి. నాణ్యతలేని సరుకులు, అధిక రేట్లకు కొనుగోలు చేయడం ద్వారా ఆలయాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. భక్తుల సొమ్మును అధికారులు ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్లకు చెల్లించి సొంత లాభం చూసుకుంటున్నారు. నాణ్యత లేని ప్రసాదాలు, అన్న ప్రసాద విరతణపై గతంలో భక్తులు అధికారులను నిలదీసిన ఘటనలు కూడా ఉన్నాయి.

అవినీతికి అడ్డుకట్ట వేసేందుకే..

ఆలయాల్లో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకే ఈ దిశగా కమిషనర్‌ ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ సంస్థల ద్వారా సరఫరార చేస్తే విమర్శలకు ఆస్కారం ఉండదని చెపుతున్నారు. పైగా ఏదైనా తేడా వస్తే అధికారులు బాధ్యులవుతారు. ఇప్పటికే విమర్శలకు తావులేని రీతిలో టీటీడీకి వీటిని సరఫరా చేస్తున్నట్లు చెపుతున్నారు.

నాణ్యమైన సన్నబియ్యంతో పాటు కందిపప్పు, చింతపండు వంటి వాటిని కూడా ప్రభుత్వ సంస్థల ద్వారానే కొనుగోలుకు నిర్ణయించారు. దీనిపై మంగళవారం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణతో కమిషనర్‌ చర్చించనున్నట్లు తెలిసింది. ఆపై విధివిధానాలు రూపొందించి సంబంధిత శాఖలతో సంప్రదింపులు జరపడం ద్వారా కొనుగోలుకు నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement